రెండు సిపిఐ ఎం.ఎల్. న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభ ప్రచార పోస్టర్ ఆవిష్కరణ!
ఈనెల 23 న విజయవాడలో విలీన సభ
గత పదకొండు ఏండ్లుగా వేర్వేరు పార్టీలుగా పని చేస్తున్న రెండు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు విలీనమై ఒకే పార్టీగా ఏర్పడ్డాయి. ఈ విలీనాన్ని బహిరంగంగా ప్రకటించడానికి ఫిబ్రవరి 23 వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడ MB భవన్ లో ఏర్పాటు చేసిన విలీనసభ పోస్టర్ల ఆవిష్కరణ ఈరోజు విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ AP రాష్ట్ర అధికార ప్రతినిధులు పి ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లతో పాటు పార్టీ, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కే పోలారి, మేకల ప్రసాద్, బద్ద వెంకట్రావు, పి. ప్రసాదరావు, ముని శంకర్, పి. పద్మ, కే. దుర్గ, ఐ. రాజేష్, ప్రమీల, లక్ష్మి, యర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధులు ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఫిబ్రవరి 23వ తేది జరగనున్న విలీనసభ జయప్రదం కోసం పార్టీ కార్యకర్తలు, విప్లవాభిమానులు, ఉద్యమ శక్తులు కృషి చేయాలని కోరారు. ఇది దేశంలో ఫాసిస్ట్ ప్రమాదం పెరిగే సంక్లిష్ట కాలమనీ, ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్ర సంక్షోభ కాలమనీ, ఇలాంటి గడ్డు కాలంలో విప్లవ, వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర ఉద్యమ సంస్థల మధ్య ఐక్యత పెరగాల్సి ఉందన్నారు. ఈ చారిత్రిక వేళ తమ రెండు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు ఐక్య కార్యాచరణ వరకే పరిమితం కాకుండా మరో ముందడుగు వేసి ఒకే పార్టీగా విలీనమైనట్లు తెలిపారు.