- ప్రేమికుల దినోత్సవం నాడు భార్యాభర్తల ఫన్నీ అగ్రిమెంట్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైనం
- అగ్రిమెంట్ పై రకరకాలుగా నెటిజన్ల కామెంట్లు
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు తమ జీవితాంతం గుర్తుండిపోయే వేడుకలు జరుపుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, విందులు ఏర్పాటు చేసుకుంటారు.
అయితే, పెళ్లి కాని ఓ ప్రేమ జంట చేసుకున్న ఫన్నీ అగ్రిమెంట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యాభర్తలు ఇలాంటి ఒప్పందాలు కూడా చేసుకుంటారా అని ఆశ్చర్యం వేస్తుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ అగ్రిమెంట్‌లోని షరతులు చూస్తే నవ్వు ఆగదు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనయ, శుభమ్ అనే దంపతులు పెళ్లయిన రెండేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఒప్పంద పత్రం రాసుకున్నారు. రూ.500 బాండ్ పేపర్‌పై అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందులో అనయ, భర్త శుభమ్‌కు కొన్ని షరతులు విధించింది.
భోజనం చేసే సమయంలో కుటుంబ విషయాలు మాత్రమే మాట్లాడాలి. ట్రేడింగ్ గురించి మాట్లాడకూడదు. బెడ్‌రూమ్‌లో స్టాక్ మార్కెట్ లాభనష్టాల గురించి చర్చించకూడదు. తనను ‘బ్యూటీ కాయిన్’, ‘క్రిప్టో పై’ అని పిలవడం ఆపేయాలి. రాత్రి 9 గంటల తర్వాత ట్రేడింగ్‌కు సంబంధించిన యాప్స్, వీడియోలు చూడకూడదు అని షరతులు పెట్టింది.
అలాగే, భార్యకు భర్త కూడా కొన్ని కండిషన్లు పెట్టాడు. తన ప్రవర్తనపై అమ్మకు ఫిర్యాదు చేయడం మానుకోవాలి. వాదన సమయంలో తన పాత ప్రేయసి ప్రస్తావన తీసుకురాకూడదు. ఖరీదైన స్కిన్‌కేర్ ఉత్పత్తులు కొనకూడదు. రాత్రిపూట స్విగ్గీ, జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేయకూడదు అంటూ షరతులు విధించాడు.
ఒకవేళ ఎవరైనా ఈ షరతులను ఉల్లంఘిస్తే మూడు నెలలపాటు బట్టలు ఉతకాలని, టాయిలెట్లు శుభ్రం చేయాలని, ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకురావాలని రాసుకున్నారు. ఈ వినూత్న అగ్రిమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.