—
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని మంత్రి నారా లోకేశ్ మంగళవారం శాసనమండలిలో వెల్లడించారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తాయని, తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతుండగా వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని, రాష్ట్రంలో 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు.
దీనికి మంత్రి లోకేశ్ వివరణ ఇస్తూ.. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పడంలేదన్నారు. పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటవుతాయని, వాటితో పాటు అనుబంధ సంస్థలలో యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. కాగా, మంగళవారం పలు అంశాలపై శాసన మండలిలో ఎన్డీయే కూటమి, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.