- కోటా జిల్లాలో కలవరపెడుతున్న విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు
- ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం
- నిత్యం అప్రమత్తంగా ఉండేలా హాస్టల్ సిబ్బందికి శిక్షణ
రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో కోచింగ్ సెంటర్లు, వసతి గృహాల నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. కోటా జిల్లాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, వారి జీవన వ్యయాన్ని తగ్గించడంతోపాటు ఆత్మహత్యల నివారణకు ఈ కొత్త నిబంధనలను రూపొందించారు.
గతంలో వసతి గృహాల యాజమాన్యాలు డిపాజిట్ గా ఏడాది మొత్తం ఫీజును మొదట్లోనే వసూలు చేసేవి. ఇకపై ఆ ఫీజును రూ.2 వేల వరకు మాత్రమే వసూలు చేసేలా నిబంధనలు విధించారు. అలాగే, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా హాస్టల్ గదుల్లో స్ప్రింగ్ తరహా సీలింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయనున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండేలా వసతి గృహాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం వంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు వీలుగా పార్కులు, క్రీడా ప్రాంగణాలు వంటి సౌకర్యాలను అందుబాటులోకి తేనున్నారు.
వరుస ఆత్మహత్యల కారణంగా కోటాకు వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. చాలా హాస్టళ్లు ఖాళీ అవుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి కోటా హాస్టళ్లకు వచ్చే విద్యార్థుల సంఖ్య 2 లక్షల నుంచి 1.24 లక్షలకు పడిపోయింది.