- అమెరికా పర్యటన కంటే ఒడిశాకే తన ప్రాధాన్యత అన్న ప్రధాని మోదీ
- ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించానని వెల్లడి
- ఒడిశాలో బీజేపీ ప్రభుత్వ మొదటి ఏడాది పాలనను కొనియాడిన ప్రధాని
అమెరికా పర్యటనకు రావాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని, ఒడిశా పర్యటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఒడిశాలో పర్యటించిన ఆయన, జగన్నాథుని భూమికి రావడం తనకెంతో ముఖ్యమని పేర్కొన్నారు. అంతకుముందు బీహార్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ, మధ్యాహ్నం ఒడిశా చేరుకుని రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొన్నారు.
జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్ ఫోన్ చేసి, వాషింగ్టన్ మీదుగా వెళ్లాలని సూచించారని, విందులో పాల్గొని చర్చించుకుందామని చెప్పారని అన్నారు.
“జగన్నాథుని క్షేత్రానికి వచ్చేందుకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని నేను వినమ్రంగా తిరస్కరించాను” అని మోదీ బహిరంగ సభలో వెల్లడించారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వ తొలి ఏడాది పాలనను ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. “ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది. పూరీ జగన్నాథ ఆలయానికి చెందిన నాలుగు ద్వారాలను, రత్న భండార్‌ను తిరిగి తెరిపించింది” అని ఆయన అన్నారు.
ఈ పర్యటనలో భాగంగా, ప్రధాని మోదీ రూ.18,600 కోట్లకు పైగా విలువైన 105 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఒడిశా విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించడంతో పాటు, పలు కొత్త రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించారు.
అంతేకాకుండా, ‘లక్షపతి దీదీలు’ సహా పలువురు లబ్ధిదారులను సత్కరించారు. తాగునీరు, నీటిపారుదల, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, గ్రామీణ రహదారులు, వంతెనలు, జాతీయ రహదారులు, రైల్వే మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. గతేడాది జూన్ ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రానికి రావడం ఇది ఆరోసారి.