- వైజాగ్ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగిస్తూ ప్రభుత్వ నిర్ణయం
- దీంతో కూటమి ప్రభుత్వంపై వైసీసీ నేతల విమర్శలు
- ఈ నేపథ్యంలో ఈరోజు స్టేడియం వద్ద ఆందోళనకు పిలుపు
విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా… తాడిగడప మున్సిపాలిటీకి, వైజాగ్ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వైసీసీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించడంపై ఈరోజు వైసీపీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నిరసనల్లో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు మధురవాడలోని క్రికెట్ స్టేడియంకు చేరుకుని వైఎస్ఆర్ విగ్రహం ముందు నిరసనకు దిగారు.
స్టేడియానికి తిరిగి వైఎస్ఆర్ పేరును జోడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను ఉద్ధృతం చేస్తామంటున్నారు. ఇక ఈ స్టేడియంలో మార్చి 24, 30 తేదీలలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఉన్న విషయం తెలిసిందే. దీంతో స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.