- మొదటిసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి
- తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర మరువలేనిదన్న రేవంత్ రెడ్డి
- నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని వ్యాఖ్య
ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం కంటే జెడ్పీటీసీగా గెలిచినప్పుడే తనకు ఎక్కువ ఆనందం కలిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మొదటిసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ‘ప్రజాపాలనలో కొలువుల పండుగ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కారుణ్య నియామకాలు క్రమం తప్పకుండా చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం వల్ల చాలామంది పదేళ్లు నష్టపోయారని ఆయన విమర్శించారు. జాబ్ క్యాలెండర్‌తో పాటు కారుణ్య నియామకాలు కూడా ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర మరువలేనిదని ఆయన గుర్తు చేశారు. స్వరాష్ట్రం వచ్చినా నిరుద్యోగుల కల నెరవేరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, బడుగుబలహీన వర్గాల వారే పోటీ పరీక్షలకు సిద్ధమవుతారని ఆయన అన్నారు. నిరుద్యోగుల బాధలను ప్రజా ప్రభుత్వం గుర్తించిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అందుకే ఏడాదిలో 59 వేల ఉద్యోగాలను ఇచ్చామని తెలిపారు.
నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని ఆయన అన్నారు. ఉద్యోగాలు ఇవ్వని వారికి ఓట్లు, ఉద్యోగాలు ఎందుకని యువత బీఆర్ఎస్‌ను ఓడించిందని అన్నారు. నిరుద్యోగుల బాధలు తనకు తెలుసని ఆయన అన్నారు. ఉద్యోగ ఖాళీలను పెండింగ్‌లో ఉంచవద్దని ఆదేశించినట్లు చెప్పారు. పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలోనే ఫలితాలు వెల్లడించామని ఆయన అన్నారు.