- చక్కెరతో టీ, కాఫీలు తీసుకుంటే డయాబెటిస్, ఊబకాయం వచ్చే అవకాశం
- కూల్‌డ్రింక్స్ కూడా తీసుకుంటే టైప్-2 డయాబెటిస్ వస్తుందన్న టీఐఎఫ్ఆర్ పరిశోధకులు
- టీ, కాఫీ, కూల్‌డ్రింక్‌లలో ఉండే సుక్రోజ్ కారణంగా కాలేయం, కండరాలు, చిన్న పేగులు దెబ్బతింటాయన్న అధ్యయనం
మీరు రోజుకు రెండుసార్లు టీ, కాఫీలు తాగుతారా? అయితే, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. తరచూ టీ, కాఫీలు తాగడంతోపాటు శీతల పానీయాలు తీసుకుంటే మధుమేహంతోపాటు ఊబకాయం వస్తుందని హైదరాబాద్‌లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజుకు రెండుసార్లు చక్కెరతో టీ, కాఫీలు తాగితే డయాబెటిస్‌తోపాటు ఊబకాయం వస్తుందని, కూల్‌డ్రింక్స్ కూడా తీసుకుంటే అదనంగా టైప్-2 మధుమేహం వస్తుందని ప్రొఫెసర్ ఉల్లాస్ ఎస్.కొల్తూర్, ప్రొఫెసర్ మహేందర్ తెలిపారు.
రెండేళ్లపాటు ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసినట్టు చెప్పారు. ఈ ప్రయోగ ఫలితాలను అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం చేసిన గ్లోబల్ డైటరీ డేటాబేస్‌తో సరిపోల్చారు. తమ పరిశోధన పత్రాన్ని ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘న్యూట్రిషనల్ బయో కెమిస్ట్రీ’లో ప్రచురించినట్టు తెలిపారు.
టీ, కాఫీ, కూల్‌డ్రింక్‌లలో ఉండే సుక్రోజ్ కారణంగా కాలేయం, కండరాలు, చిన్న పేగులపై తీవ్ర ప్రభావం పడుతున్నట్టు అధ్యయనంలో తేలింది. కాబట్టి, టీ, కాఫీలను చక్కెర లేకుండా తీసుకునేందుకు ప్రయత్నించాలని, ఇక కూల్‌డ్రింక్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని వారు వివరించారు.