- లక్షల కోట్లు ఖర్చు చేసి బీఆర్ఎస్ ఏం నిర్మించిందని ప్రశ్న
- ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు తెచ్చిందని ఆరోపణ
- లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం కూలిపోయిందన్న ఉప ముఖ్యమంత్రి
తెలంగాణలో గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 16.70 లక్షల కోట్ల నిధులు ఖర్చు చేశారని, అయితే ఆ మొత్తంతో ఏం నిర్మించారో, ఏం సాధించారో చెప్పాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా విచ్చలవిడిగా అప్పులు చేసిందని ఆయన ఆరోపించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలని నిలదీశారు.
నాగార్జున సాగర్ నిర్మించారా? శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మించారా? ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించారా? విమానాశ్రయం నిర్మించారా? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కదానికే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అదీ కూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సింగరేణికి కూడా రూ. 77 వేల కోట్లు బకాయిలు పెట్టి పోయారని ఆరోపించారు.
అసెంబ్లీ ఆమోదం లేకుండానే రూ. 2.30 లక్షల కోట్లను ఖర్చు చేసిన విషయాన్ని కాగ్ వెల్లడించిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. పదేళ్లలో ఏ గ్రామంలో అయినా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారా? అని ఆయన ప్రశ్నించారు.
గత ప్రభుత్వం భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదని ఆయన ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డును రూ. 7 వేల కోట్లకే 30 ఏళ్ల కాలానికి అమ్మేశారని ఆరోపించారు. తద్వారా భవిష్యత్తులో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా ముందే తీసుకున్నారని విమర్శించారు. నెరవేర్చలేని హామీలు ఇచ్చి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు.
2016-17లో రూ. 8 వేల కోట్లు, 2018-19లో రూ. 40 వేల కోట్లు, 2021-22లో రూ. 48 వేల కోట్లు, 2022-23లో రూ. 52 వేల కోట్లు, 2023-24లో రూ. 58,571 కోట్లు ఖర్చు చేయలేదని ఆయన పేర్కొన్నారు.