- చెన్నై వేదికగా నిన్న రాత్రి ఎంఐ, సీఎస్‌కే మ్యాచ్
- సూపర్ విక్టరీతో ఐపీఎల్ 2025లో శుభారంభం చేసిన చెన్నై
- ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన ఎంఐ స్పిన్నర్ విఘ్నేశ్
- కీలకమైన 3 వికెట్లు తీసి ఆకట్టుకున్న మణికట్టు స్పిన్నర్
- మ్యాచ్ చివర్లో యువ ఆటగాడిని ప్రత్యేకంగా అభినందించిన ధోనీ
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (ఎంఐ)పై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) విజయం సాధించింది. వాస్తవానికి లక్ష్యం మరీ పెద్దది కాకపోయినప్పటికీ ఆరంభంలో చెన్నై కాస్త తడబడుతూనే ఆడింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన పలువురు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. క్రికెట్ అభిమానుల దృష్టి ఎంఐకి చెందిన ఓ అరంగేట్ర ఆటగాడిపై పడింది.
ఐపీఎల్ లో ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే అతడు మంచి ప్రదర్శనతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అతడు… వచ్చీ రాగానే జోరు మీదున్న రుతురాజ్ గైక్వాడ్ వికెట్ ను పడగొట్టి ముంబయికి బ్రేక్ ఇచ్చాడు. అతడే విఘ్నేశ్ పుతుర్. ఓ ఆటో డ్రైవర్ కొడుకు. తల్లి గృహిణి. కేరళలోని మలప్పురమ్ కు చెందిన 24 ఏళ్ల ఈ మణికట్టు స్పిన్నర్ ను ముంబయి అతని బేస్ ప్రైజ్ రూ. 30 లక్షలకు దక్కించుకుంది.
అయితే, ఇతడు కేరళ తరఫున సీనియర్ లెవల్ క్రికెట్ ఆడలేదు. కానీ, అండర్ 14, అండర్ 19 స్థాయిలో ఆడాడు. ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్ లో అలెప్పి రిపిల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందులో రెండు వికెట్లు తీశాడు. అలాగే తమిళనాడు ప్రీమియర్ లీగ్ లోనూ ఆడాడు.
ధోనీ ప్రశంసలు…
ఈ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ నిన్నటి మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శివమ్ దూబె, దీపిక్ హూడాలను కూడా పెవిలియన్ పంపాడు. మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో సీఎస్‌కే మాజీ సారథి ఎంఎస్ ధోనీ కూడా అతడిని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. మ్యాచ్ అనంతరం అతడి భుజంపై చేయి వేసి మరి అభినందించాడు. దిగ్గజ క్రికెటర్ అభినందించడం, పైగా మ్యాచ్ లో కీలక వికెట్లు తీయడంతో విఘ్నేశ్ కోసం క్రికెట్ అభిమానులు నెట్టింట వెతికే పనిలో పడ్డారు. అతడు ఎవరో తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.