- మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన మహేశ్‌గా గుర్తింపు
- ఫొటో చూపించగా సరిగ్గా గుర్తించలేకపోయిన బాధితురాలు
- నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచారయత్నం ఘటనకు సంబంధించి పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ అని గుర్తించారు. పోలీసులు నిందితుడి ఫొటోను బాధితురాలికి చూపించగా, ఆమె స్పష్టంగా గుర్తుపట్టలేకపోయినట్లు సమాచారం.
విచారణలో మహేశ్‌ను ఏడాది క్రితం అతని భార్య వదిలి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతని తల్లిదండ్రులు కూడా మరణించారు. ఒంటరిగా ఉంటున్న మహేశ్ గంజాయికి బానిసయ్యాడని, అతడు గతంలో నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
మూడు రోజుల క్రితం తెల్లాపూర్-మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో మహిళల బోగిలో ఒంటరిగా ఉన్న బాధితురాలిపై ఒక యువకుడు అత్యాచారయత్నం చేయగా, ఆమె కొంపల్లి సమీపంలో రైలు నుంచి దూకి తప్పించుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం, మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తరలించారు.