- చైనా, పాక్ లకు దగ్గరవుతున్న బంగ్లా నూతన ప్రభుత్వం
- చైనాను మంచి మిత్రుడిగా అభివర్ణించిన తాత్కాలిక అధినేత యూనస్
- చైనా అధ్యక్షుడితో యూనస్ భేటీ, పెట్టుబడుల కోసం విజ్ఞప్తి
- రుణాలపై వడ్డీ తగ్గించాలని బంగ్లాదేశ్ వినత
బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా పదవీచ్యుతురాలయ్యాక, నోబెల్ విజేత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చాక చైనా, పాకిస్థాన్ లకు దగ్గరవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల 53 ఏళ్లలో తొలిసారిగా పాక్ నుంచి నేరుగా బంగ్లాకు కార్గో షిప్‌లు చేరుకున్నాయి. తాజాగా, బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్ చైనా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు బలం చేకూర్చుతున్నాయి.
బంగ్లాదేశ్-చైనా సంబంధాలు కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉందని యూనస్ ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా తమకు మంచి మిత్రుడని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా చైనా వెళ్లిన యూనస్, అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చైనా పెట్టుబడులను పెంచాలని ఆయన కోరారు. తీస్తా నది నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టులో చైనా కంపెనీలు పాల్గొనడానికి బంగ్లాదేశ్ సిద్ధంగా ఉందని తెలిపారు.
అలాగే, చైనా ఇస్తున్న రుణాలపై వడ్డీ తగ్గించాలని, నిధులు అందుతున్న ప్రాజెక్టులకు కమిట్‌మెంట్ ఫీజును మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని కూడా కోరారు.
గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని, వాణిజ్యం మరింత అభివృద్ధి చెందుతోందని యూనస్ పేర్కొన్నారు. చైనా సహకారంతో బంగ్లాదేశ్ ఎంతో ప్రయోజనం పొందుతోందని ఆయన అన్నారు.