- యూపీలోని నొయిడాలో ఘటన
- డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళ
- ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడుల పేరిట మోసగించిన వైనం
యూపీలోని నొయిడాకు చెందిన ఓ వ్యక్తి డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళ మాటలు నమ్మి ఏకంగా రూ. 6.5కోట్లు పోగొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే… ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థకు డైరెక్టర్ అయిన దల్జీత్‌సింగ్ భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఆయనకు ఓ డేటింగ్ యాప్ ద్వారా అనిత అనే ఓ మహిళ పరిచయమైంది. కొంతకాలానికే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.
దల్జీత్ తన మాటలు పూర్తిగా నమ్ముతున్నాడని నిర్ధారించుకున్నాక ఆమె తన పథకం అమలు చేసింది. ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అనతి కాలంలోనే మంచి లాభాలు గడించవచ్చని ఆశ చూపించింది. వెంటనే మూడు వెబ్‌సైట్ల పేర్లను కూడా సూచించింది. అలా ఆమె చెప్పిన మూడు కంపెనీల్లో దల్జీత్ రూ. 3.2 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. గంటల వ్యవధిలోనే ఆయనకు రూ. 24 వేలు లాభం వచ్చింది.
దాంతో అనిత మాటలపై దల్జీత్‌కు ఇంకా నమ్మకం పెరిగింది. ఇంకేముంది తాను దాచుకున్న రూ. 4.5కోట్ల సేవింగ్స్‌తో పాటు మరో రూ. 2 కోట్లు అప్పు చేసి మరి పెట్టుబడి పెట్టారు. అలా ఆయన రూ. 6.5 కోట్ల భారీ పెట్టుబడి పెట్టిన తర్వాత ఆమె సూచించిన ఆ మూడు వెబ్‌సైట్లు డౌన్ అయిపోయాయి. అటు అనిత మొబైల్ ఫోన్ స్వీచాఫ్ అయింది. దాంతో తాను మోసపోయానని గ్రహించిన దల్జీత్ వెంటనే నొయిడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.