
- నియోజక వర్గ మార్పుపై మంత్రి పొంగులేటి క్లారిటీ
- తిరుమలాయ పాలెం మండలంలో విస్తృత పర్యటన
- పలు సీసీ రోడ్లు, గోదాముల ప్రారంభం
- రూ. 18.68 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
తాను పాలేరు విడిచి, కొత్తగూడెం నియోజక వర్గం వెళతాననే ప్రచారం అబద్దమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలేరు నియోజక వర్గ ప్రజల ఆశీర్వాదంతోనే తాను నేడు మంత్రిగా ఉన్నానని చెప్పారు. గురువారం ఆయన తిరుమలాయపాలెం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇస్లావత్ తండాలో రూ. 30 లక్షలతో, మేడిద పల్లిలో రూ. 20 లక్షలతో, తెట్టెలపాడులో రూ. 20 లక్షలతో, పిండిప్రోలులో రూ. 30 లక్షలతో, తిరుమలాయ పాలెంలో రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను, రూ. 60.20 లక్షలతో నిర్మించిన సహకార సంఘం గోదాం, కార్యాలయ భవనాన్ని, పిండిప్రోలులో నాబార్డు వారి స్పెషల్ రీఫైనాన్స్ స్కీమ్ క్రింద రూ. 47.52 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదాం, అగ్రి అవుట్ లెట్స్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వమని, పేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను చిత్త శుద్ధితో అమలు చేస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందిస్తున్నామని అన్నారు. వేసవి కాలంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునేలా విడతల వారీగా మంజూరు పత్రాలు అందిస్తామని తెలిపారు. మొదటి విడత లోనే రాష్ట్రంలో ప్రభుత్వం 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసిందని, రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని పేర్కొన్నారు. అంతే కాకుండా, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు కార్పొరేట్ ఆసుపత్రులలో రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని అన్నారు. అర్హత గల వారందరికీ గతం కంటే అధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ రాజకీయాలకు అతీతంగా పంపిణీ చేస్తున్నామని వివరించారు. 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేశామన్నారు. రైతులకు రూ. 21 వేల కోట్ల మేర రుణాల మాఫీ చేయడంతో పాటు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 8 వేల 200 కోట్ల రైతు బంధు నిధులు విడుదల చేశామని చెప్పారు. సన్న వడ్లు క్వింటాళ్ కు 500 రూపాయల బోనస్ అందించామని తెలిపారు.
- రోడ్లకు రూ. 14 కోట్లు మంజూరు
తిరుమలాయపాలెం మండలంలోని గ్రామాలకు రూ. 14 కోట్లతో గ్రామాలలో రోడ్లు మంజూరు చేశామని, గ్రామ పరిధిలో సిసి రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామాలలో పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లను పూర్తి చేయడంతో పాటు సుమారు రూ. 2 కోట్ల 74 లక్షలతో ఖమ్మం నుంచి వరంగల్ క్రాస్ రోడ్డు వరకు ఆర్ అండ్ బీ రోడ్డు, తక్కెళ్ళ పాడు వయా పిండిప్రోలు రోడ్డు కూడా మంజూరు అయిందని, త్వరలోనే పనులు ప్రారంభించి, పూర్తి చేస్తామని తెలిపారు. గత సెప్టెంబర్లో వచ్చిన వరదల కారణంగా తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాలు తీవ్రంగా నష్ట పోయాయని అన్నారు. నష్ట పోయిన ప్రజలకు ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు అందించామని పేర్కొన్నారు. వరద భీభత్సంతో పూర్తిగా దెబ్బతిన్న రాకాసి తండ ప్రజల కోరిక మేరకు, ముఖ్యమంత్రితో చర్చించి నేడు 52 మంది పేద కుటుంబాలకు ఇంటి స్థలాలు అందించామని, వీరందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతాయని చెప్పారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 56 మంది లబ్ధిదారులకు రూ. 18.68 లక్షల ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి ఈ సందర్భంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, జిల్లా సహకార అధికారి గంగాధర్, ఆర్ అండ్ బి ఎస్ ఇ యుగంధర్, ఇర్రిగేషన్ ఎస్ఇ ఎం. వెంకటేశ్వర్లు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఏడిఏ సరిత, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, మండల ఎంపిడివో సిలార్ సాహెబ్, ఇంచార్జ్ తహసీల్దార్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
