- సుమారు రూ. 3.63 కోట్ల విలువ వుంటుందని అంచనా
- ఏపీ నుండి ఉత్తర ప్రదేశ్ కు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు సుమారు రూ. 3,63,68,000 కోట్ల విలువ చేసే 727.360 కిలోల నిషేధిత గంజాయిని పట్టుకున్నారు. శనివారం కొత్తగూడెం వన్ టౌన్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా కొత్తగూడెంలోని శేషగిరి నగర్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ గంజాయి పట్టు బడింది. తనిఖీల్లో భాగంగా UP82A19894 నంబరు గల లారీని ఆపి పరిశీలించగా, అందులో 727.360 కిలోల ప్రభుత్వ నిషేదిత గంజాయి బయట పడింది. గంజాయిని స్వాదీనం చేసుకున్న పోలీసులు, లారీలో ఉన్న డ్రైవర్ భూరి సింగ్, రవి కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గుప్తా, అదే జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ భూరి సింగ్, రవి కుమార్ కు ఈనెల 8న నగదు ఇచ్చి ఏపీలోని అల్లూరి జిల్లా తులసి పాక గ్రామ అటవీ ప్రాంతంలో నిషేదిత గంజాయిని లోడ్ చేసుకొని రమ్మని పంపాడు. ఈనెల10న వీరిద్దరూ తులసిపాక చేరుకుని అక్కడ ఏడుగురి వద్ద 727.360 కేజీల గంజాయిని తీసుకున్నారు. లార్ క్యాబిన్ కు, ట్రక్కుకు మధ్య భాగంలో ఎవరికీ కనపడకుండా ఒక చాంబర్ తయారు వేసి దానిని అందులో దాచారు. గంజాయిని తీసుకొని తిరిగి భద్రాచలం, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా ఆగ్రాకు నిషేధిత గంజాయిని తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కొత్తగూడెం వద్ద పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న లారీ డ్రైవర్ భూరి సింగ్, రవి కుమార్ ను అరెస్ట్ చేశారు. గంజాయిని అమ్మిన, కొనుగోలు చేసిన వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రవాణాకు ఉపయోగించిన లారీను, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. నిందితులను చాక చక్యంగా పట్టుకున్న కొత్తగూడెం వన్ టౌన్ సిఐ కరుణాకర్, ఎస్సై విజయ, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, సిబ్బందిని ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు.