- ఏటీఎంలో చోరీకి పాల్పడ్డ దొంగల ముఠా కోసం హైదరాబాద్ వచ్చిన బీదర్ పోలీసులు
- అఫ్జల్‌గంజ్‌లో పోలీసులను చూసి కాల్పులు జరిపిన దొంగలు
- దొంగలను వెంబడించి ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో కర్ణాటకకు చెందిన బీదర్ దొంగల ముఠా కాల్పులు జరిపింది. ఈ దొంగల ముఠా బీదర్ పోలీసులపై కాల్పులు జరిపింది. ఈ ఘటన అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. బీదర్ దొంగలు వచ్చారని తెలిసి బీదర్ నుంచి పోలీసులు కూడా హైదరాబాద్‌కు వచ్చారు. అఫ్జల్‌గంజ్‌లో పోలీసులను చూసిన దొంగల ముఠా పోలీసుల పైకి కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేసింది.
ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లారు. ఆ బీదర్ దొంగల ముఠా ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్‌పై కూడా కాల్పులు జరిపింది. వారిని వెంబడించిన బీదర్ పోలీసులు దొంగల ముఠాలోని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
ఏం జరిగింది?
బీదర్‌లో ఇటీవల పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. నగరం నడిబొడ్డున శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బందిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఏటీఎం సొమ్మును తీసుకున్న ఆ దుండగులు పారిపోయారు. వారు హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించిన బీదర్ పోలీసులు పట్టుకోవడానికి వచ్చారు.