- జగన్ విధ్వంసకర ఆర్ధిక విధానాలతోనే చంద్రబాబును ప్రజలు గెలిపించారన్న సీపీఐ నారాయణ
- అభివృద్ధి దృక్పథం ఉన్న నాయకుడు చంద్రబాబు అని కితాబు
- పీ 4 పథకం కార్పోరేట్లకు మేలు చేస్తుందే కానీ పేదలకు ఎలాంటి ఉపయోగకరం కాదని వెల్లడి
ప్రజలు ఓడించినా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన కాకానిలో ఆదివారం ఆయన పర్యటించారు. సీపీఐ జనసేవాదళ్ శిక్షణా తరగతుల శిబిరాన్ని సందర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ఆర్థిక విధ్వంసం, వికృత చర్యలకు పాల్పడటంతో రాష్ట్రంలో లక్షలాదిగా నిర్మించిన గృహాలు నిరుపయోగంగా మారి వ్యాపారులు, వినియోగదారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. విజయవాడ కనకదుర్గ వారధి నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వరకు నిర్మించిన బహుళ అంతస్తులు నిరుపయోగంగా మారాయని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారన్నారు.
జగన్ విధ్వంసకర ఆర్థిక విధానాలతోనే చంద్రబాబును ప్రజలు గెలిపించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి దృక్పథం ఉన్న నాయకుడని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే వ్యక్తి అని ఆయన కొనియాడారు. కానీ పీ4 పథకం కార్పొరేట్లకు మేలు చేస్తుందే కానీ పేదలకు ఎలాంటి ఉపయోగకరం కాదని తెలిపారు. రాష్ట్రాన్ని పూర్తిగా ప్రైవేటుపరం చేసే దిశగా ఉన్న పీ4 పాలసీని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.