- డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
- 59 ఎస్సీ ఉప కులాలను 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్ అమలు
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం సోమవారం నుండి ( ఏప్రిల్ 14 ) నుండి అమల్లోకి వచ్చింది. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం దీనిని అమల్లోకి తెచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, దేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచిండి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఈ రోజు నుంచి ఇది చట్టంగా అమలు కాబోతున్నట్టు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 17న ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ శాసన సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మార్చి18న అసెంబ్లీ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. మార్చి 19న శాసన మండలి ఆమోదం తెలిపింది. అనంతరం ఈ బిల్లు రాజ్ భవన్కు చేరి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదంతో చట్టంగా మారింది. తెలంగాణ గవర్నమెంట్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ 59 ఎస్సీ ఉప కులాలను 3 గ్రూపులుగా విభజించి ప్రభుత్వానికి లేఖ పంపింది. దానినే బిల్లులో పొందు పర్చారు. ఎస్సీల్లో అత్యంత వెనుక బడిన 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 3.288 శాతం కాగా, వీరికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు. మధ్యస్థంగా ఉన్న 18 కులాలను గ్రూప్ 2లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 62.74 శాతంగా ఉంది. వీరికి 9 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇక 26 కులాలను గ్రూప్ 3లో చేర్చారు. మొత్తం జనాభాలో వీరి వాటా 33.963 శాతం కాగా, వీరికి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది.