- మనీలాండరింగ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
- కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శామ్ పిట్రోడా పేరును కూడా చేర్చిన ఈడీ
- ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్‌లో కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను పేర్కొంది. ఇదివరకే ఈ కేసుతో సంబంధం ఉన్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు జారీ చేసింది.
తాజాగా కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శామ్ పిట్రోడా పేర్లను పేర్కొంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఏప్రిల్ 25వ తేదీన ప్రత్యేక కోర్టు ఈ కేసును విచారించనుంది.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేయడం ఇదే మొదటిసారి. హర్యానాలో జరిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.