- ఆహారం, ఇల్లు, ఉపాధి, విద్యా, ఆరోగ్యం, పింఛన్ హక్కుగా ఉండాలి
- సీపీఐ(ఎం) 24వ మహాసభల తీర్మానాలపై పోరాటంతోనే శ్రీకాంత్ కు నివాళి
- ప్రతి దేశంపైనా ట్రంప్ నిర్ణయాల ప్రభావం, స్వేచ్ఛా వాణిజ్యంపై ఆంక్షలు
- యర్రా శ్రీకాంత్ సంస్మరణ సభలో పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
- ఎర్రజెండాను కాపాడిన ధీరుడు శ్రీకాంత్ : కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని
- బలమైన ఉద్యమాల నిర్వహణే కర్తవ్యం: రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

ప్రజా హక్కుల పరిరక్షణే కమ్యూనిస్టుల బాధ్యతని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. మధురైలో ఇటీవల జరిగిన పార్టీ 24వ ఆలిండియా మహాసభల్లో ఆహారం, ఇల్లు, ఉపాధి, విద్యా, ఆరోగ్యం, పింఛన్లు దేశంలోని ప్రతి పౌరుని హక్కులుగా వుండాలని తీర్మానించినట్లు చెప్పారు. ఈ తీర్మానాల అమలుకు ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ హక్కులు సాధనే పార్టీ జాతీయ మహాసభలకు ప్రతినిధిగా హాజరై మృతి చెందిన యర్రా శ్రీకాంత్ కు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఖమ్మంలోని త్రీటౌన్ బోస్ బొమ్మ సెంటర్లో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ సంస్మరణ సభకు బీవీ రాఘవులు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పార్టీ ఆలిండియా మహాసభల్లో ఇద్దరు కామ్రేడ్స్ గుండె పోటుకు గురైనట్లు తెలిపారు. వీరిలో ఒక్కరు కేరళ మాజీ మంత్రి మణని, ఆయన కోలుకున్నారని, కానీ యర్రా శ్రీకాంత్ కోలుకుంటున్పట్టే కోలుకొని మృతి చెందటం బాధాకరమన్నారు. శ్రీకాంత్ మృతి పార్టీకి, ఆయన కుటుంబానికి తీరని లోటని నివాళి అర్పించారు. దేశవ్యాప్తంగా గడ్డుస్థితులు నెలకొన్న నేపథ్యంలో, విస్తృతంగా ఉద్యమాలు నిర్వహించాల్సిన సమయంలో శ్రీకాంత్ మన నుండి దూరం కావటం ప్రజా ఉద్యమాలకు తీరని నష్టమన్నారు. ట్రంప్ నిర్ణయాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు. ప్రపంచ దేశాలపై 125 శాతానికి పైగా వాణిజ్య సుంకాన్ని మోపేందుకు సిద్దమయ్యాడన్నారు. గ్రీన్ కార్డులు, హెచ్1బీ వీసాలనూ రద్దు చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్చావాణిజ్యంపై ఆంక్షలు తెస్తున్నట్లు చెప్పారు.
లేబర్ కోడ్ ల అమలును నిరసిస్తూ మే 20న సమ్మె
నాలుగు లేబర్ కోడ్ లను మే నెల నుంచి అమలు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటిస్తున్న నేపథ్యంలో వచ్చేనెల 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చామని బీవీ రాఘవులు చెప్పారు. ఈ కోడ్ లు అమలైతే కార్మికులు తమ బెనిఫిట్స్ అన్నింటినీ కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయాలని పిలుపు నిచ్చారు. ఛత్తీస్‌గఢ్, బస్తర్ ప్రాంతాల్లో మావోయిస్టుల పేరుతో గిరిజనులను హతమారుస్తున్నారని తెలిపారు. గిరిజనులను తరమివేసి అటవీ సంపదను హస్తగతం చేసుకోవాలనే యోచనలో మోడీ ప్రభుత్వం ఉందన్నారు.

కష్టాలొస్తే గుర్తొచ్చేది కమ్యూనిస్టులే : తమ్మినేని వీరభద్రం
ప్రపంచీకరణ ప్రక్రియలో భాగంగా ఆచరణలోకి తెచ్చిన స్వేచ్ఛా వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షల్లో భాగంగా పన్నులు విధిస్తున్నాడని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. అమెరికాకు పోటీగా మారిన సోషలిస్టు దేశం చైనాను నియంత్రించేందుకు ఆ దేశ ఎగుమతులపై ట్రంప్ 140 శాతం సుంకం విధిస్తున్నారని తెలిపారు. 44 వేల కోట్ల డాలర్ల చైనా ఉత్పత్తులపై పన్నులు విధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ పన్నులను ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నా ప్రధాని మోడీ నోరు విప్పటం లేదన్నారు. ప్రపంచ పెట్టుబడిదారి విధానానికి అమెరికా నాయకత్వం వహిస్తుందన్నారు. బతుకే భారమయ్యే రోజులు రాబోతున్నాయని, ఆ రోజు కాపాడేది కమ్యూనిస్టులేనని, కష్డమొస్తే కమ్యూనిస్టుల దగ్గరకు రావాల్సిందేనని తెలిపారు. మంత్రి పదవి ఇవ్వక పోతే సంగతి చూస్తామని సీఎంను హెచ్చరించే స్థితి వచ్చిందని, గీత దాటితే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులను హెచ్చరిస్తున్నారంటే గీత దాటే పరిస్థితులు వచ్చినట్టేగా అన్నారు. కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు అమలు కావట్లేదన్నారు. ఖమ్మం జిల్లాలో పార్టీ విచ్చిన్న సమయంలో ఎర్ర జెండాను కాపాడిన ధీరుడు యర్రా శ్రీకాంత్ అని కొనియాడారు.

అసమానతలపై ఉద్యమాలు: జాన్ వెస్లీ
దోపిడీ, అసమానతలను రూపుమాపటమే కర్తవ్యంగా ఉద్యమాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపుని చ్చారు. శాస్త్రీయ భావాలు పెంపొందుతున్న తరుణంలో మనువాద ధోరణులు, మూఢ విశ్వాసాలను పెంపొందించే శక్తులు పుట్టు కొస్తున్నాయన్నారు. అసమానతలు లేని సమాజం కోసం పోరాడాల్సిన దశలో అందరితో కలిసి పోయి ప్రజా మన్ననలు పొందిన నాయకుడు శ్రీకాంత్ దూరం కావడం పార్టీకి నష్టమన్నారు. ఈ సంస్మరణ సభలో పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి. పోతినేని సుదర్శన్. బండారు రవికుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గవీటి సరళ, సగర మేయర్ పునుకొల్లు నీరజ, డాక్టర్ యలమందలి రవీంద్రనాథ్, జీవీ మాల్ అధినేత గుర్రం ఉమామహేశ్వర రావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు మెంతుల. శ్రీశైలం, చిన్నికృష్ణారావు మాట్లాడారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. సభ ప్రారంభానికి ముందు యర్రా శ్రీకాంత్ చిత్ర పటానికి పూలమాలలు, పూలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఈ సభలో పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, మాచర్ల భారతి, బండి రమేశ్, కళ్యాణం వెంకటేశ్వర్లు, బొంతు రాంబాబు, మాదినేని రమేశ్, భూక్యా వీరభద్రం, బండి పద్మ. సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు భార్య యర్రా సుకన్య, కుమారులు రంజిత్. శ్రవంత్, జ్ఞానేశ్, సోదరులు యర్రా రమేష్, యర్రా గోపి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.