KTR
తెలంగాణ వార్తలు

నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం : కేటీఆర్

నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. చ‌ట్టాలు, న్యాయ వ్యవ‌స్థపై త‌మ‌కు న‌మ్మకం ఉంది. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి నాట‌కంలో భాగంగానే నోటీసులు.. ప్రజా స‌మ‌స్యల‌ను గాలికొదిలి నోటీసులు ఇస్తున్నారు. దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లోనే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చార‌ని కేటీఆర్ ధ్వజ‌మెత్తారు. న‌ల్లగొండ‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కొన‌సాగుతున్నది ప్రజా పాల‌న కాదు.. క‌మీష‌న్ల పాల‌న అని కేటీఆర్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. గత 17 నెలలుగా పాలన చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది అని ధ్వజ‌మెత్తారు. కమీషన్‌లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదు. పాలన కనిపించడం లేదు. డైరెక్ట్‌గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే క‌మీషన్‌లు లేనిదే పనులు జరుగడంలేదు అని స్వయంగా చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ని అడుగుతున్నా.. SLBC టన్నెల్ కూలింది, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా లేకపోయింది. మీ కమిషన్‌ల ఆరాటంతో మృతదేహాలను వెలికితీయడానికి సైతం సాహసం చేయలేక పోయారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. నల్గొండలో సుంకిశాల ప్రాజెక్ట్ కూలింది, ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజా స‌మ‌స్యల‌ను గాలికి వ‌దిలేసి.. కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొంటున్నారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి. నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు. మీరు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది. తులం బంగారం ఏమైంది? 4 వేల రూపాయల పింఛన్లు ఏమయ్యాయి? మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయి. మీవి అన్ని చిల్లర ప్రయత్నాలు మాత్రమే. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించనున్నారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Related posts

టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి

Ram Narayana

మల్లు భట్టివిక్రమార్క వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Ram Narayana

ఉచిత బ‌స్సు ప్ర‌యాణం.. ప్ర‌ధాని మోదీ వ్యాఖ్య‌ల‌పై మంత్రి పొన్నం ఫైర్‌!

Ram Narayana