మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఘటన మరువక ముందే మరో కీలక నేతను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలోని జనగూడకు చెందిన కుంజాం హిడ్మాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బోయిపరి గూడ పోలీసు స్టేషన్ పరిధిలోని పెటగూడ గ్రామ సమీపంలోని అడవుల్లో హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు అక్కడ కూంబింగ్ నిర్వహించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు తారస పడ్డారు. దీంతో మావోయిస్టులకు, పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే చాలా మంది మావోయిస్టులు అక్కడ్నుంచి పారి పోయారు. మావోయిస్టు కుంజాం హిడ్మా మాత్రం అక్కడున్న చెట్ల పొదల్లో తలదాచుకున్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతను హార్డ్కోర్ మావోయిస్టు హిడ్మా అని పోలీసుల విచారణలో తేలింది. కుంజాం హిడ్మా ప్రస్తుతం ఏరియా కమిటీ మెంబర్ కొనసాగుతున్నారు. హిడ్మా నుంచి ఏకే 47 రైఫిల్, 35 రౌండ్ల బుల్లెట్లు, 27 ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్, 90 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, 2 కేజీల గన్ పౌడర్, రెండు స్టీల్ కంటైనర్స్, రెండు రేడియోలు, ఒక ఇయర్ ఫోన్, వాకిటాకీ, బ్యాటరీ, రెండు కత్తులు, గొడ్డలి, నాలుగు టార్చ్ లైట్లు, ఒక పాలిథీన్ కవర్, మావోయిస్టు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు లభించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

పోలీసులకు అతిపెద్ద విజయం ..
కాగా హిడ్మా అరెస్టు భద్రతా బలగాలు సాధించిన మరో పెద్ద విజయంగా భావిస్తున్నారు. గతంలో ఇతడు హతమైనట్టు వార్తలు వచ్చినా ఆ తర్వాత అవి అవాస్తవమని తేలింది. చాలా కాలం పాటు కనీసం హిడ్మా ఫోటో కూడా లభించ కుండా జాగ్రత్త పడ్డాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన కుంజం హిడ్మా 2007 14 వయస్సులోనే మావోయిస్టు సంస్థలో చేరాడు. ఆయన అనేక మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొని, 2019లో ఏరియా కమిటీ మెంబర్ (ఏసీఎం)గా ఎదిగాడు. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక మావోయిస్టు సంఘర్షణల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఒడిశాలోని కొరాపుట్, మల్కాన్జరి జిల్లాల్లో నమోదైన ఏడు ప్రధాన మావోయిస్టు కేసుల్లో అతడి పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు.