- రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా తీవ్ర ఆగ్రహం
- భారత కీలక ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకం విధింపు
- ఇవాళ్టి నుంచి దశలవారీగా అమల్లోకి కొత్త టారిఫ్‌లు
- లెదర్, జ్యూయలరీ, టెక్స్‌టైల్ రంగాలు తీవ్రంగా ప్రభావితం
- భారత ఎగుమతులు సగానికి పడిపోయే ప్రమాదం
- లక్షలాది ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని తీవ్ర ఆందోళన
భారత్‌తో వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి నిరంతరాయంగా చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా, భారత్ నుంచి దిగుమతి అయ్యే కీలక ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం మేర భారీ సుంకాలను విధిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో లెదర్, వజ్రాలు-ఆభరణాలు, టెక్స్‌టైల్స్, రసాయనాలు వంటి భారత కీలక ఎగుమతి రంగాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి.
అమెరికా ప్రకటించిన ఈ కొత్త సుంకాలు దశలవారీగా అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఉన్న సుంకానికి అదనంగా, ఈ రోజు నుంచి 25 శాతం, ఆ తర్వాత ఆగస్టు 27 నుంచి మరో 25 శాతం సుంకాన్ని పెంచనున్నారు. ఈ భారీ పెంపుతో అమెరికాకు వెళ్లే భారత ఎగుమతులు 40 నుంచి 50 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారత వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి, వాటికి గిరాకీ తగ్గే అవకాశం ఉంది.
ఈ సుంకాల ప్రభావం అత్యధికంగా టెక్స్‌టైల్స్, వజ్రాలు-ఆభరణాలు, లెదర్, పాదరక్షలు, రొయ్యలు, రసాయనాలు, యంత్ర పరికరాల రంగాలపై పడనుంది. ముఖ్యంగా, భారత ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్న వజ్రాలు, ఆభరణాల పరిశ్రమపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని జెమ్ అండ్ జ్యూయలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వంటి వాణిజ్య సంఘాలు హెచ్చరించాయి. గతంలో అమెరికా 10 శాతం సుంకం విధించినప్పుడే దాదాపు 50,000 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని, ఇప్పుడు 50 శాతం పెంపుతో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశాయి.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా, టర్కీ వంటి ఇతర దేశాలను వదిలేసి, కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ శిక్షాత్మక సుంకాలను విధించడం గమనార్హం. జాతీయ భద్రత, విదేశాంగ విధాన కారణాలను చూపుతూ అమెరికా ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఈ సుంకాల నుంచి మినహాయింపు కోరుతూ భారత, అమెరికా వాణిజ్య సంఘాలు చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలించలేదు. ఈ పరిణామంతో న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
కొత్త టారిఫ్‌ల వల్ల వివిధ రంగాలపై పడే ప్రభావం
- ఆర్గానిక్ రసాయనాలు: 54 శాతం అదనపు డ్యూటీ
- కార్పెట్లు: 52.9 శాతం
- వస్త్రాలు (అల్లిన): 63.9 శాతం
- వస్త్రాలు (నేసిన): 60.3 శాతం
- వస్త్రాలు (మేడ్ అప్స్): 59 శాతం
- వజ్రాలు, బంగారం, ఉత్పత్తులు: 52.1 శాతం
- యంత్రాలు, యాంత్రిక ఉపకరణాలు: 51.3 శాతం
- ఫర్నిచర్, పరుపులు: 52.3 శాతం
ఈ అదనపు 25 శాతం సుంకం ఆగస్టు 27 నుంచి అమలులోకి రానుంది. అంతకు ముందు విధించిన 25 శాతం సుంకం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 45.3 బిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయి.
పలు రంగాలపై పెను ప్రభావం
50 శాతం టారిఫ్ వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే రంగాలలో వస్త్రాలు/దుస్తులు (10.3 బిలియన్ డాలర్లు), రత్నాలు, ఆభరణాలు (12 బిలియన్ డాలర్లు), రొయ్యలు (2.24 బిలియన్ డాలర్లు), లెదర్ వస్తువులు, పాదరక్షలు (1.18 బిలియన్ డాలర్లు), రసాయనాలు (2.34 బిలియన్ డాలర్లు), ఎలక్ట్రికల్, మెకానికల్ యంత్రాలు (సుమారు 9 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.
ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ సమాఖ్య (సీఐటీఐ) ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా భారతదేశానికి అతిపెద్ద వస్త్ర, దుస్తుల ఎగుమతి మార్కెట్ అని పేర్కొంది. ఈ టారిఫ్‌ల వల్ల ఇతర దేశాలతో పోటీ పడే సామర్థ్యం గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడింది.
రష్యా యుద్ధం ఆపితే భారత్ పై టారిఫ్ లు తగ్గొచ్చు: ట్రంప్

- ప్రస్తుతం మాత్రం పన్నులు చెల్లించాల్సిందేనన్న అమెరికా అధ్యక్షుడు
- యుద్ధ విరమణకు రష్యాకు విధించిన గడువు శుక్రవారంతో ముగింపు
- తాజా చర్చల్లో కీలక పురోగతి కనిపించిందని ట్రంప్ వెల్లడి
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ తో యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్ పై తొలుత 25 శాతం టారిఫ్ లు విధించిన ట్రంప్.. తాజాగా మరో 25 శాతం అదనపు టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చలు జరిపిన తర్వాత ట్రంప్ ఈ నిర్ణయం వెలువరించారు.
ఉక్రెయిన్ తో యుద్ధం ఆపాలంటూ రష్యాకు ట్రంప్ విధించిన గడువు కూడా రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, రష్యా– ఉక్రెయిన్ యుద్ధ విరమణకు సంబంధించిన చర్చల్లో కీలక పురోగతి సాధించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే రష్యా యుద్ధం ఆపేస్తే భారత్ పై పన్నుల భారం తగ్గిస్తారా? అంటూ ఓ మీడియా ప్రతినిధి ట్రంప్ ను ప్రశ్నించారు.
ట్రంప్ జవాబిస్తూ.. ‘రష్యా యుద్ధం ఆపేస్తే భారత్ పై పన్నులు తగ్గుతాయా అంటే చెప్పలేం. బహుశా తగ్గొచ్చు. కానీ ఇప్పుడే చెప్పలేను. యుద్ధ విరమణకు సంబంధించిన చర్చల్లో పురోగతి సాధించడానికి భారత్ పై విధించిన అదనపు సుంకాలు కూడా కారణం కావొచ్చు. అందువల్ల టారిఫ్ లు తగ్గే అవకాశం ఉంది’ అని వివరించారు. అయితే, ప్రస్తుతం భారత్ పై 25 శాతం సుంకాలు అమలులోకి వచ్చాయని, ఈ నెల 27 నుంచి అదనపు సుంకాలు అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ పన్నులు చెల్లించాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు.
రైతుల కోసం ఎంతటి మూల్యమైనా చెల్లిస్తా.. అమెరికాకు ప్రధాని మోదీ గట్టి కౌంటర్

- భారత ఎగుమతులపై మరో 25 శాతం సుంకం పెంచిన అమెరికా
- రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్న ప్రధాని మోదీ
- దేశ రైతుల కోసం భారత్ సిద్ధంగా ఉందన్న ప్రధాని
దేశ రైతుల ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని, వారి కోసం ఎంతటి మూల్యం చెల్లించడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసిన మరుసటి రోజే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నందుకు ప్రతీకార చర్యగా భారత ఎగుమతులపై అమెరికా బుధవారం అదనంగా 25 శాతం సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. గత నెల 20న విధించిన 25 శాతంతో కలిపి ఇప్పుడు మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు.
“రైతులు, పశుపోషకులు, మత్స్యకారుల ప్రయోజనాలే మాకు అత్యంత ప్రాధాన్యం. ఈ విషయంలో భారత్ ఎన్నటికీ రాజీపడదు. ఇందుకోసం నేను వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలుసు. అయినా నేను సిద్ధంగా ఉన్నాను. దేశ రైతుల కోసం భారత్ సిద్ధంగా ఉంది” అని ఆయన తేల్చిచెప్పారు.
అమెరికా చర్యపై భారత విదేశాంగ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. రష్యా చమురు దిగుమతుల విషయంలో భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం “అన్యాయమైన, అహేతుకమైన చర్య” అని పేర్కొంది. దేశ ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసింది. 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకునే తమ దిగుమతులు ఉంటాయని తెలిపింది.
భారత్‌పై ట్రంప్ టారిఫ్ వార్.. అయినా బెదరని రూపాయి!

- భారత ఎగుమతులపై 50 శాతానికి సుంకాలు పెంచిన అమెరికా
- భారీ సుంకాల తర్వాత కూడా బలపడిన రూపాయి
- డాలర్‌తో పోలిస్తే 3 పైసలు పుంజుకున్న భారత కరెన్సీ
భారత్‌తో వాణిజ్యం విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరించింది. భారత ఎగుమతులపై సుంకాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, ఈ పరిణామం రూపాయి మారకం విలువపై తక్షణ ప్రతికూల ప్రభావం చూపకపోవడం గమనార్హం. ఈ రోజు ఉదయం ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 3 పైసలు బలపడి 87.69కి చేరుకుంది.
సుంకాల పెంపునకు కారణం ఏమిటి?
రష్యా నుంచి భారత్ ముడి చమురును దిగుమతి చేసుకోవడాన్ని నిరసిస్తూ డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత ఉత్పత్తులపై అదనంగా మరో 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ బుధవారం ప్రకటించారు. దీంతో భారత ఎగుమతులపై అమెరికా విధించే మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌కు ఇది ఒక ‘జరిమానా’ అని ఆయన వ్యాఖ్యానించారు. రష్యాతో వాణిజ్యం కొనసాగించే ఇతర దేశాలపైనా ఇలాంటి చర్యలే ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.
అమెరికా నిర్ణయంపై భారత్ తీవ్ర స్పందన
అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం “అన్యాయం, అసంబద్ధం, అహేతుకం” అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. తమ దేశ ఇంధన అవసరాల గురించే తాము ఆలోచిస్తున్నామని స్పష్టం చేసింది. “140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే మేము చమురు దిగుమతులు చేసుకుంటున్నాము. ఈ విషయంలో మా వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం.
అనేక ఇతర దేశాలు కూడా తమ జాతీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చర్యలే తీసుకుంటున్నాయి. అలాంటప్పుడు అమెరికా కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత దురదృష్టకరం” అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారగా, ఆర్థిక నిపుణులు తదుపరి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.
భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్… కీలక వ్యాఖ్యలు చేసిన శశిథరూర్

- రష్యా నుంచి అమెరికా యురేనియం దిగుమతి చేసుకుంటోందన్న థరూర్
- అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని మండిపాటు
- ఇండియా కొత్త వాణిజ్య భాగస్వాములను చూసుకోవాలని సూచన
రష్యాతో చమురు కొనుగోలు చేయవద్దంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికను భారత్ ఏమాత్రం ఖాతరు చేయలేదు. తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఇండియా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ పై తొలుత 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్… ఆ తర్వాత మరో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు.
ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పుబట్టారు. ఓపక్క రష్యా నుంచి అమెరికా యురేనియం, పల్లాడియం వంటి వాటిని దిగుమతి చేసుకుంటూ.. మరోపక్క భారత్ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. మనకంటే ఎక్కువగా రష్యన్ చమురును చైనా దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. భారత్ పై ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరికాదని అన్నారు.
ఈ అనుభవం నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని థరూర్ సూచించారు. ఈ పరిస్థితుల్లో భారత్ ఇతర వాణిజ్య భాగస్వాములను చూసుకోవడాన్ని ప్రారంభించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మనకు అమృతం దక్కొచ్చు: ట్రంప్ టారిఫ్ ల పెంపుపై ఆనంద్ మహీంద్రా

- సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలన్న ఆనంద్ మహీంద్రా
- దీనికోసం భారత్ రెండు బలమైన అడుగులు వేయాలని సూచన
- ప్రపంచ పెట్టుబడులకు భారత్ తిరుగులేని వేదికగా అవతరించాలన్న మహీంద్రా
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా భారత్ పై సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతానికి పెంచారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ నుంచి టారిఫ్ ల రూపంలో ఎదురైన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని ఆనంద్ మహీంద్రా అన్నారు. దీని కోసం భారత్ రెండు బలమైన అడుగులు వేస్తే… సుంకాల మథనంలో మనకు అమృతం దక్కే అవకాశం ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ట్రంప్ ప్రారంభించిన సుంకాల యుద్ధం కారణంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు కనిపిస్తోందని ఆనంద్ మహీంద్రా అన్నారు. జర్మనీ, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలు ట్రంప్ సుంకాల విధింపుతో సొంత వ్యూహాలకు పదును పెట్టాయని చెప్పారు. దీని ఫలితంగా ప్రపంచ అభివృద్ధికి కొత్త ఇంజిన్లు లభిస్తున్నాయని అన్నారు. భారత్ కూడా ఈ సంక్లిష్ట క్షణాలను అవకాశంగా మలుచుకోవాలని చెప్పారు.
1991లో మన దేశంలో నెలకొన్న విదేశీ మారక నిల్వల సంక్షోభంతో లిబరలైజేషన్ కు నాంది పడిందని తెలిపారు. ఇప్పటి పరిస్థితుల నుంచి అమృతం దక్కించుకోవడానికి భారత్ రెండు అడుగులు వేయాల్సి ఉందని చెప్పారు.
ప్రపంచ పెట్టుబడులకు తిరుగులేని వేదికగా భారత్ అవతరించాలని సూచించారు. దీని కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని వేగంగా మెరుగుపరచాలని అన్నారు. విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకు పర్యాటక రంగాన్ని శక్తిగా మలుచుకోవాలని చెప్పారు. టూరిజం వల్ల ఉపాధి కూడా పెరుగుతుందని అన్నారు. తయారీ రంగంపై దిగుమతి సుంకాలను క్రమబద్ధీకరించాలని సూచించారు.