- బీసీ బంద్‌కు మద్దతుగా కవిత మానవహారం
- ఆటోలో వచ్చి ఖైరతాబాద్ చౌరస్తాలో ధర్నా
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కావాలని డిమాండ్
బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న బంద్‌లో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత… కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీల హక్కుల కోసం పోరాడుతున్నామని చెబుతూ అవే పార్టీలు బంద్‌లో పాల్గొనడం “హంతకులే నివాళులు అర్పించినట్లు” ఉందని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఖైరతాబాద్ చౌరస్తాలో బీసీ బంద్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన మానవహారంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కవిత తన జాగృతి కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆటోలో రావడం గమనార్హం. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్రంలోని బీసీలు తమకు 42 శాతం రిజర్వేషన్లు కావాలని ఎప్పటినుంచో కోరుతున్నారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలు బీసీ బిడ్డలను మోసం చేస్తూనే ఉన్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
అవసరమైతే, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరో బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తామని ఆమె స్పష్టం చేశారు. తమిళనాడులో బీసీ రిజర్వేషన్ల కోసం పదేళ్ల పాటు ఎన్నికలు జరగలేదన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఐదు నెలలు ఎన్నికలు ఆలస్యమైనా నష్టం లేదని, బీసీలకు న్యాయం జరగడమే ముఖ్యమని కవిత పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.
బీసీ సంఘాల బంద్ లో కల్వకుంట్ల కవిత కుమారుడు..!

––
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఈ రోజు బీసీ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతుండగా.. ఎక్కడికక్కడ బీసీ సంఘాల నేతలు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బంద్ లో తెలంగాణ జాగృతి కూడా పాలుపంచుకుంది. ఖైరతాబాదు చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు ఆమె కుమారుడు ఆదిత్య పాల్గొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని నినదించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆదిత్య నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ల కోసం కేవలం తన తల్లి ఒక్కరే పోరాడితే సరిపోదని, రాష్ట్రంలోని బీసీలు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ బయటకు వచ్చి పోరాడాలని ఆదిత్య కోరారు.