
- ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు మృతి చెందినట్లు డీజీసీఏ ధ్రువీకరణ
- ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి కూలిపోయిన విమానం
- సీఎం ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా
- స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా జరిగిన దుర్ఘటన
మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విమానంలో ప్రయాణిస్తున్న ఇదుగురూ మరణించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారికంగా ధ్రువీకరించింది.
బుధవారం ఉదయం ముంబై నుంచి బయలుదేరిన విమానం, సుమారు 9 గంటల సమయంలో బారామతి వద్ద ల్యాండింగ్ అవుతుండగా అదుపుతప్పి కూలిపోయింది. ప్రమాద తీవ్రతకు విమానంలో మంటలు చెలరేగి, దట్టమైన పొగలు అలముకున్నాయి. విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల నేపథ్యంలో బారామతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారు వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి ప్రమాద వివరాలను, తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాద వార్త తెలియగానే అజిత్ పవార్ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు.
సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవలు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మూడు మృతదేహాలను బారామతి మెడికల్ కాలేజీకి తరలించామని, మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని పుణె ఎస్పీ తెలిపారు. డీజీసీఏ అధికారుల బృందం కూడా ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.
అజిత్ పవార్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం.. పవన్, జగన్, కేటీఆర్ సంతాపం

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈరోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందడం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.
ఏపీ సీఎం చంద్రబాబు అజిత్ పవార్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ఈ ఉదయం విమాన ప్రమాదంలో అజిత్ పవార్ అకాల మరణం వార్త విని తీవ్రంగా కలత చెందాను. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా, అజిత్ పవార్ ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పవార్ మరణం ప్రజా జీవితానికి తీరని లోటని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తమ సంతాపాన్ని ప్రకటించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేత అయిన పవార్ ప్రజాసేవ చిరస్మరణీయమని పవన్ కొనియాడారు. క్షేత్రస్థాయిలో బలమైన సంబంధాలున్న అనుభవజ్ఞుడైన నేతను కోల్పోయామని, మహారాష్ట్ర రాజకీయాలకు ఇది తీరని లోటని కేటీఆర్ అన్నారు.
విమాన ప్రమాదం తర్వాత అజిత్ పవార్‌ను స్థానికులు ఎలా గుర్తు పట్టారంటే?
- ల్యాండింగ్ చేస్తున్న సమయంలో కుప్పకూలిన విమానం
- అజిత్ పవార్‌తో పాటు నలుగురు సిబ్బంది మృతి
- గాగుల్స్, చేతి వాచీ ఆధారంగా అజిత్‌ను గుర్తు పట్టిన స్థానికులు
ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడం మహారాష్ట్రలో పెను విషాదం నింపింది. సాంకేతిక సమస్య కారణంగా బారామతి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు సిబ్బంది మృతి చెందారు. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడని ఎలా గుర్తించారో ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
గాగుల్స్, చేతివాచీ ఆధారంగా అజిత్ పవార్‌ను గుర్తించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వాటి ఆధారంగానే ప్రమాదానికి గురైంది ఉప ముఖ్యమంత్రి అని తెలుసుకున్నామని అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత నాలుగైదు పేలుడు శబ్ధాలు వినిపించినట్లు వారు చెప్పారు. తమ కళ్ల ముందే ప్రమాదం జరిగిందని, విమానం ఉన్నట్లుండి కిందకు వస్తుంటే అది కూలిపోయేలా ఉందని తమకు అనిపించిందని అన్నారు.
ఆ సమయంలో విమానం నుంచి శబ్ధం కూడా భిన్నంగా వచ్చినట్లు తెలిపారు. కాసేపటికే విమానం కుప్పకూలిందని, పెద్ద ఎత్తున మంటలు రావడంతో పాటు నాలుగైదు భారీ శబ్ధాలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. తాము వెంటనే ప్రమాదస్థలానికి చేరుకుని, అందులో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశామని అన్నారు. రెండు మృతదేహాలు బయటకు ఎగిరిపడ్డాయని, ప్రమాదస్థాయి అంత తీవ్రంగా ఉందని అన్నారు.
ప్రమాద ఘటనపై డీజీసీఏ అధికారులు స్పందిస్తూ, ఇది ఎత్తైన కొండల ప్రాంతాల్లో ఉండే టేబుల్ టాప్ రన్‌వే అని, విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగానే రన్‌వే స్టార్టింగ్ పాయింట్‌లో ఇది కుప్పకూలిందని వెల్లడించారు.
అజిత్ పవార్ మృతి.. విమాన ప్రమాదంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
- విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలన్న మమతా బెనర్జీ
- రాజకీయ నాయకుల భద్రతపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని ఆందోళన
- ఇతర దర్యాప్తు సంస్థలపై తమకు విశ్వాసం లేదన్న మమతా బెనర్జీ
- అజిత్ పవార్ మృతిలో కుట్రకోణం ఉండవచ్చన్న మమతా బెనర్జీ
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రమాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బారామతి విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో దేశంలోని రాజకీయ నాయకుల భద్రతపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని ఆమె అన్నారు.
అజిత్ పవార్ మృతిలో కుట్రకోణం ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. పవార్ మరణ వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆయన మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని వెలితి అన్నారు. సుప్రీంకోర్టు పైన మాత్రమే తమకు నమ్మకం ఉందని, అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలోనే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఇతర దర్యాప్తు సంస్థలపై తమకు విశ్వాసం లేదని, అవి వాటి స్వేచ్ఛను కోల్పోయాయని విమర్శించారు.
అజిత్ పవార్ బీజేపీని వీడాలని ఆలోచిస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగిందని ఈ సందర్భంగా మమతా బెనర్జీ గుర్తు చేశారు. పవార్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పారదర్శక దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ విజ్ఞప్తి చేశారు.
అజిత్ పవార్ విమానంలో ఫస్ట్ ఆఫీసర్.. ఎవరీ శాంభవీ పాఠక్?
- బారామతి విమాన ప్రమాదంలో మృతి చెందిన శాంభవీ పాఠక్
- చిన్న వయస్సులోనే కమర్షియల్ విమానాలు నడిపే లైసెన్స్ పొందిన శాంభవి
- న్యూజిలాండ్‌లో కమర్షియల్ పైలట్ అకాడమీలో శిక్షణ తీసుకున్న శాంభవి
- అజిత్ పవార్ విమానంలో ఫస్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించిన శాంభవి
మహారాష్ట్రలోని బారామతిలో కూలిపోయిన విమానంలో మృతి చెందిన పైలట్‌లలో కెప్టెన్ శాంభవీ పాఠక్ ఒకరు. ఈ ప్రమాదంలో కీలక రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందిన విషయం తెలిసిందే. కెప్టెన్ శాంభవి పాఠక్ ఆ విమానంలో ఫస్ట్ ఆఫీసర్ (కొన్ని సందర్భాల్లో కో-పైలట్ అంటారు)గా పని చేస్తున్నారు. చిన్న వయస్సులోనే కమర్షియల్ విమానాలు నడిపే లైసెన్స్ పొందారు.
ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ బాలభారతి పాఠశాలలో విద్యార్థినిగా శాంభవి పాఠక్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 2016-18లో సెకండరీ స్కూల్ పూర్తయ్యాక ముంబై యూనివర్సిటీ నుంచి ఏరోనాటిక్స్, ఏవియేషన్, ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. వాణిజ్య విమానాల శిక్షణ కోసం ఆమె న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో చేరారు.
అనంతరం భారత్‌కు వచ్చి డీజీసీఏ నుంచి కమర్షియల్ పైలట్ లైసెన్స్‌తో పాటు ఫ్రొజెన్ ఎయిర్ లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ కూడా పొందారు. అంటే, భవిష్యత్తులో పెద్ద విమానాల కెప్టెన్ కావడానికి అవసరమైన సర్టిఫికెట్ అని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్‌లో కొత్త పైలట్లకు శిక్షణ ఇచ్చేలా అసిస్టెంట్ ప్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా పని చేశారు. ఆమె క్రమశిక్షణ, నైపుణ్యం, పని పట్ల మక్కువ కలిగి ఉంటారని ఆమె గురించి తెలిసిన వారు చెబుతారు.
2022 నుంచి ఆమె వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పూర్తిస్థాయి ఫస్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీఐపీలు, బిజినెస్ ప్రముఖులు ప్రయాణించే లియర్ జెట్-45 లాంటి విమానాలను ఆమె నడుపుతున్నారు. ఈరోజు అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో పైలట్ ఇన్ కమాండ్‌గా కెప్టెన్ సుమిత్ కపూర్ ఉన్నారు. శాంభవి పాఠక్ ఫస్ట్ ఆఫీసర్‌గా పని చేశారు.
అజిత్ పవార్ మరణం.. పైలట్ల నుంచి అలాంటి కాల్ రాలేదు: డీజీసీఏ కీలక విషయం వెల్లడి

- బారామతి విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు మృతి
- రన్ వేను గుర్తించడంలో పైలట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న డీజీసీఏ
- ఆపదలో ఉన్నామని తెలియజేసే మేడే కాల్స్ రాలేదన్న డీజీసీఏ
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిన ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పందించింది. ల్యాండింగ్ సమయంలో రన్ వేను గుర్తించడంలో పైలట్లకు ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొంది. మొదటిసారి రన్ వేపై విమానం ల్యాండింగ్‌కు పైలట్ ప్రయత్నించారని, కానీ సరిగ్గా కనిపించకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టినట్లు వెల్లడించారు.
రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే ముందు గో అరౌండ్ పాటించినట్లు సమాచారం ఉందని, ఈ సమయంలో పైలట్ల నుంచి ఆపదలో ఉన్నామని తెలియజేసే ఎలాంటి మేడే కాల్స్ రాలేదని డీజీసీఏ కీలక విషయం వెల్లడించింది. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.