తెలంగాణ వార్తలు

కేసీఆర్ కు నోటీసులు అందించిన సిట్.. రేపే విచారణ…బీఆర్ యస్ ఆగ్రహం…

  • నంది నగర్ లోని నివాసంలో నోటీసులు అందించిన సిట్
  • విచారణకు పీఎస్ కు రావాల్సిన అవసరం లేదన్న సిట్ అధికారులు
  • ప్లేస్ చెబితే తామే అక్కడకు వస్తామని వెల్లడి

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు అందాయి. హైదరాబాద్ లోని నందినగర్ లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరుపుతామని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. 

కేసీఆర్ వయసు దృష్ట్యా విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని సిట్ తెలిపింది. హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతం వివరాలను తెలిపితే… అక్కడకే వచ్చి విచారణ జరుపుతామని పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్ లను సిట్ విచారించింది. మళ్లీ అవసరమైతే విచారణకు పిలుస్తామని వారికి తెలియజేసింది. ఇప్పుడు గులాబీ బాస్ ను విచారణకు పిలవడంతో ఆ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరెన్ని మలుపులు చోటుచేసుకుంటాయో అనే ఆసక్తి సర్వత్ర నెలకొంది.

కేసీఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టే: సిట్ నోటీసులపై హరీశ్ రావు ఫైర్

Harish Rao Fires Over SIT Notices to KCR in Phone Tapping Case

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యేనని, ఈ కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణ జాతి పిత అని, కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవమని, అలాంటి నాయకుడిపై బురద చల్లాలని చూడటం సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని వ్యాఖ్యానించారు.

పాలనలో తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ముఖ్యంగా సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సిట్ పేరుతో నోటీసుల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూడటం రేవంత్ రెడ్డి రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు.

తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్ద కాలంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని హరీశ్ రావు కొనియాడారు. కేసీఆర్ చరిత్రను సృష్టిస్తే, ఆ చరిత్రను మలినం చేసేందుకు రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, అహంకారం అంతకంటే కాదని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ వెంటే ఉందని, ప్రభుత్వ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హరీశ్ రావు హెచ్చరించారు.

కేసీఆర్ కు సిట్ నోటీసులపై మహేశ్ గౌడ్ స్పందన.. బాధ్యులకు శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్య..

KCR Receives SIT Notice Mahesh Goud Reacts

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నంది నగర్ లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ వయసును దృష్టిలో ఉంచుకొని ఆయన కోరిన ప్రదేశంలోనే విచారిస్తామని సిట్ అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. 

మరోవైపు, కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ వ్యవహారంలో పారదర్శకంగా సిట్ విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. కేసీఆర్ పై తమకు ఎంతో గౌరవం ఉందని… అయితే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందో నిగ్గుతేలాల్సి ఉందని చెప్పారు.

అప్పటి సీఎం, మంత్రుల ఆదేశాలు లేకుండా ఇంతటి భారీ స్థాయి ఉల్లంఘనలు జరిగే అవకాశమే లేదని ఆయన అన్నారు. పూర్తి స్థాయిలో సిట్ దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం సిట్ కు ఉందని… కేసీఆర్‌కు నోటీసుల విషయంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని చెప్పారు. బాధ్యులు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.

ఇది విచారణ కాదు… ప్రతీకారం: కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కేటీఆర్ ఫైర్

KTR Fires on Congress Over SIT Notice to KCR Calling it Vendetta

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది విచారణ కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న రాజకీయ ప్రతీకార చర్య అని ఆయన అభివర్ణించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్, పాలనా లోపాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఇది కేవలం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని, రాజకీయ దురుద్దేశంతోనే ఈ నోటీసులు ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ.. “చావు నోట్లో తలపెట్టి, సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని దీక్షతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్. తన పదేళ్ల పాలనలో మిషన్ భగీరథ, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారు. సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. అలాంటి నాయకుడిపై అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విచారణల పేరుతో వేధించడం దుర్మార్గం” అని ధ్వజమెత్తారు.

తమ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే బీఆర్ఎస్ అధినేతపై కాంగ్రెస్ కక్ష కట్టిందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడని, కేవలం నోటీసులు ఇచ్చి, బెదిరింపులకు పాల్పడి తెలంగాణ ఉద్యమ చరిత్రను, ఆయన కీర్తిని చెరిపేయలేరని హెచ్చరించారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే సహించేది లేదని, ప్రజలే సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఈ కక్ష సాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోందని, ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ అన్యాయ పాలనపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కేటీఆర్ ఉద్ఘాటించారు. చరిత్రను విచారణలతో కాదని, ప్రజల తీర్పుతోనే రాస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

కేసీఆర్ కు సిట్ నోటీసులు.. కేసు విచారణ సీరియస్ గా జరగడం లేదన్న కవిత

29-01-2026 Thu 16:53 | Telangana

KCR Receives SIT Notice Kavitha Alleges Non Serious Investigation

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. రేపు కేసీఆర్ విచారణ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. 

సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ కూతురు, జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందిస్తూ… కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. సిట్ విచారణ నాన్-సీరియస్ గా జరుగుతోందని, ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని అన్నారు. కేసును సీరియస్ గా తీసుకుని త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని… అయితే, కేసును ముగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? లేదా? అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరగడం నిజంగానే చాలా బాధాకరమని… కానీ, దానికి తగినటువంటి పర్యవసానాలను నేరస్తులు ఎదుర్కొంటారా? లేదా? అనేది వేచిచూడాలని అన్నారు.

Related posts

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించండి – తుమ్మల, శ్రీధర్ బాబు

Ram Narayana

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కొత్త నేర చట్టాల ప్రకారం కేసు…

Ram Narayana

జైలు నుంచి బయటకు వచ్చి తొడగొట్టి చెప్పాను : ఆలేరు సభలో రేవంత్ రెడ్డి

Ram Narayana