ఏపీ పోలీసు శాఖలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా పోలీస్ అధికారి తన పదవీ విరమణకు కేవలం 24 గంటల ముందు నాన్-కేడర్ ఎస్పీగా పదోన్నతి పొందారు. సుదీర్ఘకాలం సర్వీసులో ఉన్న అధికారికి చివరి రోజున దక్కిన ఈ గౌరవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే… తిరుపతి రీజనల్ ఏసీబీ విభాగంలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న విమలకుమారికి ప్రభుత్వం నాన్-కేడర్ ఎస్పీగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సోమవారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఆమె ఈరోజు (మార్చి 31) ఉద్యోగ విరమణ చేయనున్నారు. పదోన్నతి ఉత్తర్వుల ప్రకారం ఆమె ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి, అదే రోజు రిటైర్ కానున్నారు. సర్వీస్ చివరిలో ప్రమోషన్ రావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేసినా, ఒక్కరోజు మాత్రమే ఆ హోదాలో ఉండి రిటైర్ కావలసి రావడం మిశ్రమ అనుభూతిని మిగిల్చింది.
ఎవరీ విమలకుమారి?
విమలకుమారి 1989 బ్యాచ్‌కు చెందిన అధికారిణి. ఎస్ఐగా పోలీసు శాఖలో చేరిన ఆమె, విజయవాడ జోన్ పరిధిలో పనిచేశారు. 2018లో డీఎస్పీగా పదోన్నతి పొంది, తిరుపతి ఎస్‌బీ, ఏసీబీ, టీటీడీ విజిలెన్స్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీసిటీ, విశాఖపట్నం, తిరుపతి క్రైమ్ విభాగాల్లో అదనపు ఎస్పీగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది.
విమలకుమారితో పాటు మొత్తం ఆరుగురు 1989 బ్యాచ్ అదనపు ఎస్పీలకు ప్రభుత్వం నాన్-కేడర్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించింది. వీరిలో దేవ ప్రసాద్ (సీఐడీ ఎస్పీ), సీహెచ్ లక్ష్మీపతి (ఆక్టోపస్ ఎస్పీ), సీహెచ్ పాపారావు (విశాఖ క్రైమ్స్ డీసీపీ), టి. కనకరాజు (సీఐడీ ఎస్పీ), నక్కా సూర్యచంద్రరావు (విజయవాడ ట్రాఫిక్ డీసీపీ) ఉన్నారు.
గతేడాది కూడా పార్వతీపురం మన్యంలో ఇలాంటి ఘటనే నమోదు
గతేడాది కూడా ఇలాంటి ఘటనే పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. అదనపు ఎస్పీగా ప్రమోషన్‌పై బదిలీ అయిన ఎల్. నాగేశ్వరి, బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయడం గమనార్హం.