ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

మావిగన్ పై టీడీపీ వైసీపీ మాటల యుద్ధం ….

జగన్ ప్రతిపాదన అవినీతిపై ఎక్కు పెట్టిన ‘గన్’లా ఉంది: కన్నబాబు

Kannababu Comments on Jagans Proposal and Corruption

వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ కాన్సెప్ట్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబులో వణుకు మొదలైందని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో అద్భుతమైన రాజధానిని నిర్మించవచ్చనే జగన్ ఆలోచన కూటమి ప్రభుత్వానికి మింగుడు పడటం లేదని ఎద్దేవా చేశారు.

అమరావతి కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం… మరోవైపు రాష్ట్రంలో జీతాలకు కూడా డబ్బులు లేవని ఆర్థిక మంత్రి ద్వారా చెప్పించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అమరావతిపై చంద్రబాబు చేస్తున్న ఖర్చు కేవలం అవినీతి కోసమేనని, జగన్ ప్రతిపాదన ఆ అవినీతిపై ఎక్కుపెట్టిన ‘గన్’లా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి అమరావతిని ‘కమ్మరావతి’ అని సంబోధించినా కూటమి నేతలు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ఏబీఎన్ రాధాకృష్ణ తన రాతల ద్వారా జగన్‌పై విషం చిమ్ముతున్నారని, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే భయమే వారిని ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పురిగొల్పుతోందని కన్నబాబు వ్యాఖ్యానించారు.

‘మావిగన్’పై ప్రజల్లో జరుగుతున్న చర్చను చూసి ప్రభుత్వానికి భయం పట్టుకుంది: కాకాణి

Kakani Govardhan Reddy Slams Coalition Government Over Mavigun Debate

వైసీపీ నాయకుల వ్యక్తిగత జీవితాలు, మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, ఏబీఎన్ రాధాకృష్ణపై ధ్వజమెత్తారు.

వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’పై ప్రజల్లో జరుగుతున్న చర్చను చూసి కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుందని కాకాణి విమర్శించారు. ఆ చర్చను పక్కదారి పట్టించేందుకే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.

ఏబీఎన్ రాధాకృష్ణ తన ‘కొత్త పలుకు’ ద్వారా వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా మహిళలపై విషం చిమ్ముతున్నారని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ దళారీ పనులు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం మహిళల వ్యక్తిగత జీవితాలను కించపరచడం అత్యంత నీచమైన చర్య అని, దీనిని రాష్ట్రంలోని మహిళా లోకం ఛీత్కరించుకుంటోందని పేర్కొన్నారు.

జగన్‌ను ఎంత ఎక్కువగా దూషిస్తే కూటమి ఎమ్మెల్యేలకు అంత మెరుగైన ర్యాంకింగ్స్ ఇస్తామని చంద్రబాబు టార్గెట్లు పెట్టారని కాకాణి ఎద్దేవా చేశారు. జగన్‌ను తిట్టడమే వారి లక్ష్యంగా మారిందని అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సోషల్ మీడియాలో వైసీపీపై నెగెటివ్ ట్రోలింగ్ చేయిస్తున్నారని, ఇదంతా ప్రజల దృష్టిని మళ్లించేందుకేనని ఆయన ఆరోపించారు.

రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి క్షుద్ర విద్యలు ప్రదర్శిస్తున్నారని, త్వరలోనే మళ్లీ వైఎసీపీ అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కాకాణి ధీమా వ్యక్తం చేశారు.

‘మావిగన్’ అనడం ఆయన పిచ్చికి నిదర్శనం: యాడికి సభలో సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Slams Opposition Remarks at Yadiki Meeting

దశాబ్దాలుగా కరవుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నీటి భద్రత కల్పించడం ద్వారా రాయలసీమ రూపురేఖలు మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన ప్రకటించారు. సోమవారం అనంతపురం జిల్లా యాడికిలో నిర్వహించిన ‘నీటి భద్రత-రైతు సంఘాల బాధ్యత’ కార్యాచరణ ప్రారంభ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంద రోజుల ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని, దానిని సమష్టిగా సాధిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఒకే రాజధాని అమరావతి.. మూడు ముక్కలాట వద్దు

రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుందని, అదే అమరావతి అని చంద్రబాబు మరోసారి పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వ మూడు రాజధానుల విధానాన్ని ‘మూడు ముక్కలాట’గా అభివర్ణించారు. “గతంలో మీ రాజధాని ఏదని బయట అడిగితే చెప్పలేక నామోషీ పడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు గర్వంగా నా రాజధాని అమరావతి అని చెప్పుకునే ధైర్యం వచ్చింది” అని అన్నారు. 

దేవతల రాజధాని అయిన అమరావతి పేరు పలకడానికి కూడా ఇష్టం లేని వాళ్లు రాష్ట్రాన్ని నాశనం చేశారని, ప్రత్యర్థి పార్టీ నేత అమరావతిని ‘మావిగన్’ అనడం ఆయన పిచ్చికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

అధికారుల పనితీరుపై సీఎం సమీక్ష.. అక్కడికక్కడే క్లాస్

ఈ సభలో చంద్రబాబు తనదైన శైలిలో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయం ఆధారంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షించారు. తాడిపత్రి నియోజకవర్గంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (76 శాతం), హౌసింగ్ (72 శాతం) వంటి శాఖలు ఉత్తమ పనితీరు కనబరచాయని అభినందించారు. 

అదే సమయంలో, జిల్లా స్థాయిలో పనితీరు బాగాలేని అధికారులను వేదికపైనే నిలదీశారు. ముఖ్యంగా పంచాయతీ రాజ్, కాలేజీ ఎడ్యుకేషన్, రోడ్లు, విద్యుత్, వ్యవసాయం వంటి శాఖల్లో జిల్లా స్థాయి రేటింగ్స్ తక్కువగా ఉండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డీపీఓ, ఆర్అండ్‌బీ, ఎలక్ట్రికల్ అధికారులను పిలిచి పనితీరు మెరుగుపరచుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

“నేను గౌరవంగా మాట్లాడుతున్నా, మరోసారి రివ్యూకి వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడతా, పనితీరు మెరుగుపడాలి” అని స్పష్టం చేశారు. ఉచిత ఇసుక విధానంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఉద్యోగం ఊడుతుందని మైనింగ్ అధికారులను హెచ్చరించారు.

జల భద్రతే లక్ష్యం.. భూగర్భ జలాలే సంపద

నీటి విలువ తనకు పూర్తిగా తెలుసని, నీటి భద్రత కోసం మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నానని చంద్రబాబు గుర్తుచేశారు. “పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని ఒక జలాశయంగా చేసుకోవాలి” అనే తన నినాదాన్ని పునరుద్ఘాటించారు. 

గతంలో టీడీపీ ప్రభుత్వం నీరు-చెట్టు, పంట కుంటలు, ఇంకుడు గుంతలు, సూక్ష్మ సేద్యం, రైన్ గన్లు వంటి అనేక కార్యక్రమాల ద్వారా భూగర్భ జలాలను పెంచిందని వివరించారు. కేవలం గత 21 నెలల్లోనే రాష్ట్రంలో భూగర్భ జలమట్టం 1.92 మీటర్లు పెరిగిందని, ఒక్క అనంతపురం జిల్లాలోనే 2.1 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని గణాంకాలతో సహా వివరించారు. అన్నమయ్య జిల్లాలో ‘జలసిరి’ కార్యక్రమం కింద ఒకే ఏడాదిలో 8 మీటర్ల భూగర్భ జలాలు పెంచిన విజయాన్ని ఉదాహరణగా చూపారు. వర్షాకాలం ముగిసేసరికి రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టాన్ని 3 మీటర్ల లోపునకు తీసుకురాగలిగితే, కరవు అనే మాటే ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాయలసీమను ప్రపంచ హార్టికల్చర్ హబ్ చేస్తాం

రాయలసీమను రత్నాల సీమగా మార్చడంలో భాగంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే బృహత్ ప్రణాళికను చంద్రబాబు ఆవిష్కరించారు. రాబోయే ఆరేడు సంవత్సరాల్లో రూ.30 వేల కోట్ల ప్రభుత్వ పెట్టుబడి, రూ.70 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులతో మొత్తం లక్ష కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని ప్రకటించారు. దీని ద్వారా ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచి, ఉత్పత్తిని రెట్టింపు చేయడమే లక్ష్యమని తెలిపారు. 

“దేశంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉంటే, దానికి చిరునామా రాయలసీమ” అని ఆయన గర్వంగా ప్రకటించారు. మైక్రో ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడం వల్లే ఇది సాధ్యమైందని గుర్తుచేశారు.

నదుల అనుసంధానంతో కరవుకు చెక్

రాష్ట్రంలోని నదుల అనుసంధానం తన జీవితాశయమని చంద్రబాబు పేర్కొన్నారు. “శ్రీకాకుళంలో కురిసిన వర్షపు నీరు అనంతపురానికి రావాలి” అనే తన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ వేదికగా హామీ ఇచ్చారు. 

పోలవరం పూర్తయితే గోదావరి నీళ్లు గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాకు చేరతాయని, తద్వారా ఆదా అయిన శ్రీశైలం నీటిని పూర్తిగా రాయలసీమకు తరలించి ప్రతి ఎకరాకు సాగునీరు అందించవచ్చని వివరించారు. గోదావరి నుంచి నాగార్జున సాగర్, అక్కడి నుంచి నల్లమల సాగర్ ద్వారా శ్రీశైలానికి నీటిని తీసుకొచ్చి సీమ కరవును శాశ్వతంగా తీర్చే ప్రణాళికను వెల్లడించారు. వంశధార-నాగావళి, వెలిగొండ, చింతలపూడి వంటి పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.

అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సూపర్ సిక్స్ పథకాలను సమయానికి అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, మహిళల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా, తెలుగుజాతిని ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలబెట్టడమే తన లక్ష్యమని ప్రకటించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని, ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమష్టిగా పనిచేసి సుపరిపాలన అందించి రాష్ట్ర భవిష్యత్తును బంగారుమయం చేద్దామని కోరారు.

Related posts

ఏపీలో జగన్ ఘోరంగా ఓడిపోతారు …ప్రశాంత్ కిషోర్ జోశ్యం

Ram Narayana

మళ్ళీ గెలుపు మాదే సందేహం లేదు …మదనపల్లె సభలో సీఎం జగన్

Ram Narayana

జగన్ కు ఆర్కే అత్యంత సన్నిహితుడు.. అంచనాలను అందుకోలేననే రాజీనామా చేసి ఉండొచ్చు: అయోధ్య రామిరెడ్డి

Ram Narayana