అంతర్జాతీయం

భారీ భద్రతతో ఇస్లామాబాద్ కు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్

ఎఫ్‌-16ల ఎస్కార్ట్‌తో ఇస్లామాబాద్‌కు అమెరికా వైస్ ప్రెసిడెంట్

ప‌శ్చిమాసియాలో సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం కనుగొనే దిశగా ఒక చారిత్రక ముందడుగు పడింది. దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న అమెరికా, ఇరాన్ దేశాలు ఉన్నతస్థాయి చర్చలకు సిద్ధమయ్యాయి. ఈ కీలక చర్చలకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా నిలిచింది. అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించేందుకు ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న అమెరికా వాయుసేనకు చెందిన బోయింగ్ సీ-32ఏ విమానానికి పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్‌)కు చెందిన ఐదు ఎఫ్‌-16 ఫైటర్ జెట్లు పాక్ గగనతలంలో ఎస్కార్ట్ ఇచ్చాయి. అనంతరం ఆయన విమానం ఇస్లామాబాద్ సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది.

1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఇంత ఉన్నతస్థాయిలో ముఖాముఖి చర్చలు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్‌తో పాటు ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా పాల్గొంటున్నారు. ఇరాన్ తరపున ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్, విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.

అయితే, ఈ చర్చలకు ముందు ఇరు దేశాల మధ్య అవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. “మాకు మంచి ఉద్దేశాలు ఉన్నాయి. కానీ, మేము అమెరికన్లను నమ్మడం లేదు. వారితో చర్చల విషయంలో మా గత అనుభవాలు వైఫల్యాలతోనే ముగిశాయి. వారు ఇచ్చిన హామీలను ఎప్పుడూ నిలబెట్టుకోలేదు” అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘలీబాఫ్ అన్నట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ మాత్రం సానుకూలంగా స్పందించింది. ఇరు దేశాలు నిర్మాణాత్మకంగా చర్చల్లో పాల్గొని, శాశ్వత పరిష్కారం దిశగా సాగాలని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆకాంక్షించారు.

గతంలో చర్చల నిబంధనలపై ఇరు దేశాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇరాన్ తన వద్ద ఉన్న అత్యధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అప్పగించాలని, సైనిక శక్తిపై పరిమితులను అంగీకరించాలని కోరుతూ ట్రంప్ ప్రభుత్వం 15 పాయింట్ల ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించింది. దీనికి బదులుగా తమకు నష్టపరిహారం చెల్లించాలని, హ‌ర్మూజ్ జలసంధిపై టెహ్రాన్ సార్వభౌమాధికారాన్ని అమెరికా గుర్తించాలని కోరుతూ ఇరాన్ 10 పాయింట్ల ప్రణాళికను పంపింది. మరోవైపు ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య దాడులకు తాత్కాలిక విరామం లభించడంతో వచ్చే వారం ఆ రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇది ఈ ప్రాంతంలో శాంతి ప్రయత్నాలకు ఊతమిచ్చే పరిణామంగా భావిస్తున్నారు.

Related posts

అమెరికాలో ఆ పని చేస్తున్నారా?.. దేశం విడిచి వెళ్లాల్సిందే!

Ram Narayana

బంగ్లాదేశ్‌లో ప్రముఖ సింగర్ జేమ్స్ కచేరీపై దాడి..!

Ram Narayana

ఆ దేశం వెరీ డేంజర్… అక్కడికి వెళ్లొద్దంటూ తమ పౌరులకు అమెరికా హెచ్చరిక!

Ram Narayana