అమెరికాలో ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకుపోయిన దొంగలు.. చరిత్రలో నిలిచిపోతుందన్న పోలీసులు!
- ఒహియాలోని అక్రోన్‌లో ఘటన
- 58 అడుగుల పొడవు, 10 మీటర్ల వెడల్పు ఉన్న బ్రిడ్జి
- ఎవరు చేశారో.. ఎందుకు చేశారో అర్థం కావడం లేదంటున్న పోలీసులు
- బ్రిడ్జిని ఎత్తుకుపోవడం మామూలు విషయం కాదంటున్న అధికారులు
సాధారణంగా దొంగలు డబ్బో, దస్కమో ఎత్తుకుపోతారు. అమెరికాలోని ఒహియోలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగింది. జరిగిన దొంగతనాన్ని చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు. చోరశిఖామణులు ఏకంగా 58 అడుగుల బ్రిడ్జిని ఎలాంటి ఆనవాళ్లు లేకుండా మొత్తంగా ఎత్తుకుపోయారు. తమ జీవితంలోనే ఇలాంటి దొంగతనాన్ని చూడలేదని పోలీసులు చెప్పడం గమనార్హం.
ఒహియోలోని అక్రోన్‌లోని చిన్న వాగుపై 58 అడుగుల పొడవైన బ్రిడ్జి ఉంది. వన్ ఫైన్ డే దొంగలు ఆ బ్రిడ్జి మొత్తాన్ని లేపుకెళ్లిపోయారు. అటుగా వచ్చినవారు అక్కడ బ్రిడ్జి ఆనవాళ్లు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. అక్కడసలు ఓ బ్రిడ్జి వుండేదన్న ఆనవాళ్లే లేనంతగా చాలా చాకచక్యంగా ఊడ్చేసిన వైనాన్ని చూసి నోరెళ్లబెట్టారు.
ఈ బ్రిడ్జిని 2000వ సంవత్సరం మొదట్లో నిర్మించారు. బ్రిడ్జిని ఎత్తుకుపోవడానికి ముందు డెక్ బోర్డులు తొలగించారు. ఆ తర్వాత వారం రోజులకే బ్రిడ్జి మాయమైందని పోలీసులు తెలిపారు. 10 మీటర్ల వెడల్పు, ఆరు అడుగుల ఎత్తు, 58 అడుగుల పొడువున్న ఈ వంతెనను ఎత్తుకుపోవడమంటే సామాన్యమైన విషయం కాదన్నారు. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎలా చేశారు? వంటి ప్రశ్నలను ఈ ఘటన రేకెత్తిస్తోందని అన్నారు.
ఈ ప్రశ్నల్లో వేటికీ ప్రస్తుతానికి సమాధానాలు లేవన్నారు. ఇది తప్పకుండా మిస్టరీల్లో ఒకటిగా మిగిలిపోతుందని చెప్పారు. ఇంకా చెప్పాలంటే, ఈ బ్రిడ్జిని ఎత్తుకుపోయిన దొంగలకు దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని పోలీసులు వివరించారు. ఎందుకంటే దీనిని పాలిమర్ మెటీరియల్‌ను ఉపయోగించి నిర్మించారని, స్క్రాప్ కింద విక్రయించడానికి, రీసైక్లింగ్‌కు కూడా ఇది పనికిరాదని వివరించారు. అయితే, దొంగలు విలువైనదిగా భావించి ఈ పని చేసి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు.