ఎన్నికల సరదా ఉంటె చంద్రబాబు కుప్పకు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి …ఎమ్మెల్యే రోజా
-మామాటిమాటికి ఎన్నికలు అంటూ చంద్రబాబు ముచ్చట పడుతున్నారు
-ముందస్తు ఎన్నికలకు రెడీగా ఉన్నామని చంద్రబాబు అంటున్నారు
-కుప్పంలో రాజీనామా చేసి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలి
-మమ్మల్ని రాజీనామా చేయమనడం కాదు
-మీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్‌వైపే జనం ఉన్నారని రోజా చెప్పారు. ముందస్తు ఎన్నికలకు రెడీగా ఉన్నామని చంద్రబాబు అంటున్నారని, అయితే, కుప్పం ప్రజలు కూడా చంద్రబాబుకు మద్దతు తెలపడం లేదని ఆమె తెలిపారు. కుప్పంలో రాజీనామా చేసి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి చంద్రబాబునాయుడు గెలవాలని ఆమె సవాలు విసిరారు.
వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమనడం కాదని, అంత సరదాగా ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆమె సవాలు విసిరారు. అప్పుడు టీడీపీ నేతల సరదా తీరుతుందని ఆమె ఎద్దేవా చేశారు. ప్రతి కుటుంబానికి కొడుకులా జగన్ అన్న సాయం చేస్తున్నారని, అందుకే ప్రజలందరూ జగనన్నకు మద్దతు తెలుపుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ దెబ్బకి విలవిలలాడి చంద్రబాబు కుప్పం బాట పట్టారని ఆమె చురకలంటించారు.
కుప్పం ప్రజలకు చంద్రబాబునాయుడు చేసింది శూన్యమని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బాబు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారని ఆమె తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రజలు ఎవరి వైపు ఉన్నారో చూపిస్తామని రోజా అన్నారు. కుప్పం ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబునాయుడికి ఏ రోజూ లేదని ఆమె ఆరోపించారు. జగన్‌పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె అన్నారు. ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా తమ పార్టీయే విజయం సాధిస్తోందని ఆమె చెప్పారు.