రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు.. ఉక్రెయిన్ లో ఇరుక్కుపోయిన తెలుగు విద్యార్థులు!
- ఉక్రెయిన్ లోని వివిధ వర్సిటీల్లో చదువుతున్న 200 మంది
- మొత్తంగా 18 వేల మంది భారతీయ విద్యార్థులు
- వారి వివరాలు తీసుకుంటున్న భారత ఎంబసీ అధికారులు
- చదువులు ఆపేసి రావడం ఇష్టం లేదంటున్న విద్యార్థులు
రష్యా–ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధ పరిస్థితులతో తెలుగు విద్యార్థులు భయాందోళనల్లో ఉన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా ఆయుధాలు, సైన్యాన్ని మోహరిస్తుండడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అక్కడ మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్న తెలుగు విద్యార్థులు భయంతో అక్కడ ఉండలేక, చదువులను మధ్యలో వదిలేసి రాలేక సతమతమవుతున్నారు. తదుపరి సెమిస్టర్ మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతుందని, ఇలాంటి తరుణంలో చదువులను మధ్యలో ఎలా వదిలేయగలమని అంటున్నారు.
ప్రస్తుతం అక్కడ తెలంగాణ, ఏపీకి చెందిన 200 మందికి పైగా విద్యార్థులున్నారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీయీవ్ లోని భారత ఎంబసీలో విద్యార్థులు తమ తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పరిస్థితులు తీవ్రతరమైతే తమను స్వదేశం తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని మెడిసిన్ చదువుతున్న ఓ విద్యార్థి చెప్పారు. పేరు, వయసు, పాస్ పోర్ట్ నంబర్, ఉక్రెయిన్ లో ఉంటున్న ప్రదేశం, భారత్ లోని ఏ రాష్ట్రం నుంచి వచ్చారు వంటి వివరాలను తీసుకున్నారని తెలిపారు. అంతేగాకుండా ఉక్రెయిన్ లో చదువుతున్న యూనివర్సిటీ వివరాలనూ తీసుకున్నారు.
కాగా, కీయివ్ లోని భారత రాయబార కార్యాలయం వెబ్ సైట్ ప్రకారం భారత్ కు చెందిన 18 వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్ లోని వివిధ వర్సిటీల్లో ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ వంటి కోర్సులు చదువుతున్నారు. ప్రస్తుతానికి పరిస్థితులు సాధారణంగానే ఉన్నా తమను వివిధ దరఖాస్తులను నింపాల్సిందిగా అధికారులు కోరుతున్నారని ఓ విద్యార్థిని చెప్పారు. ఇవీవ్ లో ఉంటున్న ఆమె.. కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చానని, ఇప్పుడు చదువు మధ్యలో ఆపేసి వెళ్లే పరిస్థితి లేదని అంటున్నారు.
ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఏర్పడి తమను అక్కడి నుంచి తరలిస్తే పరిస్థితేంటన్నది అర్థం కావట్లేదన్నారు. తనకైతే యూనివర్సిటీ వదిలి వెళ్లాలని లేదని, ఇక్కడే ఉండి చదువుకోవాలని ఉందని చెప్పారు.