ఐఎంపీఎస్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచిన స్టేట్ బ్యాంక్!
- ఆన్‌లైన్ లావాదేవీలపై రుసుములు వసూలు చేయబోమన్న ఎస్‌బీఐ
- బ్యాంకు శాఖల వద్ద నిర్వహించే లావాదేవీలపై రుసుము ప్లస్ జీఎస్టీ
- రూ. 2 లక్షల వరకు పాత చార్జీలే వర్తింపు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) నగదు బదిలీ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఇది అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. అలాగే, ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా నిర్వహించే ఈ-లావాదేవీలపై ఎలాంటి రుసుములు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. బ్యాంకు శాఖల వద్ద నిర్వహించే లావాదేవీలకు మాత్రం రుసుము వసూలు చేస్తున్నట్టు పేర్కొంది.
రూ. 2 లక్షల వరకు లావాదేవీలకు పాత రేట్లే వర్తిస్తాయని తెలిపింది. అయితే, రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు లావాదేవీలను బ్యాంకు శాఖల ద్వారా నిర్వహిస్తే రూ. 20 వసూలు చేస్తామని, దీనికి జీఎస్‌టీ అదనమని వివరించింది. బ్యాంకు బ్రాంచుల వద్ద రూ. 1000 వరకు చేసే ఐఎంపీఎస్ లావాదేవీలకు ఎలాంటి చార్జీలు వర్తించవు.
అయితే, రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు రూ. 2 రుసుముతోపాటు అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు. రూ. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు 4 రూపాయలకు తోడు జీఎస్టీ, లక్ష నుంచి 2 లక్షల వరకు రూ. 12 రుసుముకు తోడు జీఎస్టీ, రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు జరిపే లావాదేవీలపై రూ. 20 రుసుము, అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు.