రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న మంచి పనుల పట్ల ఎలాంటి సంకోచం లేకుండా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం: సీఎం జగన్!
- విజయవాడకు విచ్చేసిన నితిన్ గడ్కరీ
- పలు రోడ్ల పనులకు శంకుస్థాపన
- కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
- కేంద్రం ముందు పలు ప్రతిపాదనలు
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ విజయవాడ వచ్చారు. పలు రహదారుల పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, రాష్ట్రానికి సంబంధించి కేంద్రం తరఫున చేసిన మంచి పనులన్నింటికి ఏపీ ప్రజల తరఫున ఎలాంటి సంకోచాలు, రాజకీయాలకు తావులేకుండా సంతోషం వెలిబుచ్చుతున్నామని, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు.
రహదారుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. భూసేకరణతో పాటు అన్ని అంశాల్లో సత్వరమే నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించారు. రహదారుల అభివృద్ధికి రూ.10,600 కోట్లు కేటాయించినట్టు వివరించారు.
రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. రూ.20 వేల కోట్లతో 51 ప్రాజెక్టులకు ముందడుగు పడుతోందని వివరించారు. గడ్కరీ సహకారంతో బెజవాడ బెంజి సర్కిల్ వేగంగా పూర్తయిందని తెలిపారు. అలాగే, రాష్ట్రానికి మరికొన్ని రోడ్ల నిర్మాణం కూడా అత్యావశ్యకమని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆయా రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపుతున్నామని, కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ దయచేసి వాటిని ఆమోదించాలని సభాముఖంగా కోరుతున్నట్టు తెలిపారు.
విశాఖ తీరంలో విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా రిషికొండ, భీమిలి కొండలను తాకుతూ సముద్ర తీరాన టూరిజంకే వన్నె తెచ్చే విధంగా ఆరు లేన్ల రహదారి ఎంతో అవసరమని సీఎం జగన్ ఉద్ఘాటించారు. విజయవాడ తూర్పున కృష్ణా నదిపై వంతెన సహా దాదాపు 40 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు అవసరమని స్పష్టం చేశారు. నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుందని అన్నారు. విజయవాడ పశ్చిమ బైపాస్ కు అనుమతి ఇచ్చారని, అలాగే తూర్పు బైపాస్ కు కూడా అనుమతి ఇవ్వాలని నితిన్ గడ్కరీని కోరారు.
కడప జిల్లా భాకరా పేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా ప్రకాశం జిల్లా బేస్తవారపేట రహదారి, పుంగనూరు నుంచి పులిచెర్ల మీదుగా చిన్నగొట్టిగల్లు రహదారి, సబ్బవరం నుంచి చోడవరం, నర్సీపట్నం మీదుగా తుని రహదారి, విశాఖపట్నం నుంచి నర్సీపట్నం, చింతపల్లి, చింతూరు మీదుగా భద్రాచలం వరకు ఉన్న రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరారు.
తెలుగువాడైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పుడూ నాలుగడుగులు ముందుకు వేస్తున్నారని, ఆయన కూడా మరోసారి చొరవ చూపాలని ఆశిస్తున్నట్టు సీఎం జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
అంతకుముందు కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం అన్ని విధాలుగా దోహదపడుతోందని తెలిపారు. శ్రీశైలం, సింహాద్రి, అన్నవరం ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ.21 వేల కోట్లతో రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు. రహదారుల అనుసంధానంతోనే అభివృద్ధి సాధ్యమని కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. అన్ని రాష్ట్రాల సమాన అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగుతోందని అన్నారు.