Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

శ్రీలంకలో దుర్భర పరిస్థితులు.. ఆహారం లేక అలమటిస్తున్న ప్రజలు!

శ్రీలంకలో దుర్భర పరిస్థితులు.. ఆహారం లేక అలమటిస్తున్న ప్రజలు!
-ఆర్థిక, ఇంధన సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక
-పెట్రోల్ బంకుల వద్ద క్యూలలో నిలబడి స్పృహ కోల్పోతున్న లంకేయులు
-కాగితం కొరతతో వాయిదా పడిన పరీక్షలు

శ్రీలంక పరిస్థితి నానాటికీ దుర్భరంగా మారుతోంది. ఆర్థిక, ఇంధన సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా దిగజారుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో ఎంతో మంది ప్రజలు ఆహారం లేక అలమటిస్తున్నారు. పనులు లేక అనేకమంది పస్తులు ఉంటున్నారు . కోడిగుడ్డు రేటు 35 రూపాయలు ,కిలో చికెన్ 1000 రూపాయలు పలుకుతుంది. అవికూడా సరిపడలేక నో స్టాక్ బోర్డు లు దర్శనమిస్తున్నాయి .ప్రజల ఆకలిని తీర్చడంలో శ్రీలంక ప్రభుత్వం ఇతరదేశాల సహాయం కోరుతుంది. ఇప్పటికే మనదేశంలో పాటు అనేక దేశాలు సహాయం ప్రకటించాయి. సరిపడా ఇంధనం లేకపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. 750 మెగావాట్ల విద్యుత్ కొరతతో శ్రీలంక సతమతమవుతోంది. విదేశాల నుంచి డీజిల్ వచ్చినప్పటికీ, డబ్బులు చెల్లించకపోవడంతో దాన్ని అన్ లోడ్ చేయలేకపోతున్నారు. శుక్రవారానికి ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, డీజిల్ కొనుగోలు కోసం బంకుల వద్ద ఎవరూ బారులు తీరొద్దని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ పేర్కొంది. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద మండుటెండలో క్యూ లైన్లలో నిల్చుంటున్నవారిలో పలువురు స్పృహ కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తున్నది .

శ్రీలంకలో ప్రస్తుతం రోజుకు 10 గంటల సేపు కరెంట్ కోత విధిస్తున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో రోడ్లపై అంధకారం నెలకొంటోంది. కొన్ని రెస్టారెంట్లు కొవ్వొత్తుల వెలుగుల్లోనే వ్యాపారాన్ని నడిపిస్తున్నాయి. ఔషధాల కొరత కూడా శ్రీలంకను వేధిస్తోంది. అత్యవసరం కాని ఆపరేషన్లను ఆసుపత్రులు వాయిదా వేస్తున్నాయి. కాగితం కొరత కూడా లంకను చాలా ఇబ్బంది పెడుతోంది. ఈ నెలలో విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. శ్రీలంక ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ దేశాలు ఇతోధిక సహాయం చేయాలనీ ఆంతర్జాతీయ సమాజం పిలుపునిస్తున్నది .

Related posts

కుప్పం పురపాలక ఎన్నికల్లో అక్రమాలకు తావులేదు : ఎస్ఈసీ నీలం సాహ్నీ!

Drukpadam

ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర

Drukpadam

హైదరాబాదులో న్యూ ఇయర్ వేడుకల మార్గదర్శకాలు !

Drukpadam

Leave a Comment