యాదాద్రిపైకి ప్రైవేట్ వాహనాల నిషేధం..నిత్య కైంకర్యాల వేళలు ఇవే!
- ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగానే కొండపైకి భక్తులు
- 4 గంటల నుంచి నిత్య కైంకర్యాలు ప్రారంభం
- రెండు విడతలుగా సర్వదర్శనం
- వివరాలు వెల్లడించిన యాదాద్రి ఈవో గీత
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రికి వచ్చే భక్తులకు చెందిన ప్రైవేట్ వాహనాలను ఇకపై కొండపైకి అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీకి చెందిన బస్సుల్లో కింద నుంచి కొండపైకి భక్తులను ఉచితంగానే చేరవేయనుంది. ఈ మేరకు ఆలయ ఈవో గీత గురువారం కీలక ప్రకటన విడుదల చేశారు.
ఇక ఆలయంలో స్వామి వారి నిత్య కైంకర్యాల వేళలను కూడా ఈవో ప్రకటించారు.ఉదయం 4 నుంచి 4.30 గంటల వరకు సుప్రభాతం, 4.30 నుంచి 5 గంటల వరకు బిందె తీర్థం, 5 నుంచి 5.30 గంటల వరకు బాల భోగం, 5.30 నుంచి 6 గంటల వరకు పుష్పాలంకరణ సేవ, 6 నుంచి 7.30 గంటల వరకు సర్వ దర్శనం, 7.30 నుంచి 8.30 గంటల వరకు నిజాభిషేకం, 8.30 నుంచి 9 గంటల వరకు సమస్రనామార్చన, 9 నుంచి 10 వరకు బ్రేక్ దర్శనం, 10 నుంచి 11.45 గంటల వరకు సర్వ దర్శనం కల్పించనున్నట్లు ఈవో తెలిపారు.