భారత్ – నేపాల్ మధ్య రైలు సర్వీసు!
- రేపు ప్రారంభించనున్న ఇరుదేశాల ప్రధానులు
- జై నగర్ నుంచి కుర్తా వరకు మార్గం అందుబాటులోకి
- బలపడనున్న ద్వైపాక్షిక సంబంధాలు
భారత్, నేపాల్ మధ్య బంధం మరింత బలపడనుంది. ఇరు దేశాల మధ్య రైలు సర్వీసులు మొదలవుతున్నాయి. బీహార్ లోని జైనగర్ నుంచి నేపాల్ లోని జనక్ పూర్ తాలూకు కుర్తా వరకు (35 కిలోమీటర్లు) ప్యాసింజర్ రైలు సర్వీసును భారత ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా సంయుక్తంగా ఏప్రిల్ 2న ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ రైలు సర్వీసు తోడ్పాటు నందిస్తుందని ఈస్ట్ సెంట్రల్ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి బీరేంద్ర కుమార్ ప్రకటించారు. జైనగర్, కుర్తా మధ్య మొదటి దశ, కుర్తా, బిజల్ పుర మధ్య రెండో విడత రైలు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. మూడో దశలో బిజల్ పుర నుంచి బర్దిదాస్ మధ్య రైలు మార్గం అందుబాటులోకి రానుంది. జైనగర్, బిజల్ పుర మధ్య 1937లోనే బ్రిటిష్ కాలంలో రైలు నడిపారు. వరదల వల్ల 2001లో ఇది నిలిచిపోయింది.