ఏపీ లో కమ్మ సామాజికవర్గానికి మంత్రివర్గంలో స్టానం లేకపోవడంపై టీడీపీ నేత ఫైర్
–జగన్ సర్కార్‌కు టీడీపీ తీట్లు, శాపనార్థాలు
–జగన్ సర్కార్ కావాలని వ్యూహాత్మకంగా కమ్మ సామాజికవర్గాన్ని అణిచివేస్తుందని ఆరోపణ
–ఇలాంటి బతుకు ఎందుకు బయటకు రావాలని వైసీపీలోని కమ్మ నేతలకు పిలుపు
–కమ్మ కులంలో ఓటు బ్యాంక్ ఏకం కలవాలని పిలుపు
–ఇప్పటివరకు మంత్రివర్గంలో కమ్మ సామాజికవర్గం లేని సందర్భంలేదని మండిపాటు
–వైసిపిని సర్వనాశనం చేసేందుకు శపథం తీసుకోవాలని కమ్మ నాయకులకు పిలుపు
ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కమ్మజాతికి స్థానం లేక పోవడంపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యాన్ని కల్పించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఏపీలోని కమ్మ సామాజిక వర్గ నాయకులందరూ పార్టీలకు అతీతంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కమ్మ నాయకులు బయటికి రావాలని డిమాండ్ చేస్తోన్నారు.
దీనిపై తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఓ వీడియోను విడుదల చేశారు. కమ్మ సామాజిక వర్గ నేతల్లో ఏ మాత్రం పౌరుషం, జాతి పట్ల గౌరవం, సత్తా ఉన్నా.. తక్షణమే వైసీపీ నుంచి బయటికి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గ మంత్రి లేని ప్రభుత్వం, చరిత్ర లేదని గుర్తు చేశారు. ప్రతి ప్రభుత్వ మంత్రివర్గంలోనూ కమ్మ నాయకులకు ప్రాధాన్యతతో కూడిన పోర్ట్‌ఫోలియోలు ఉండేవని చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా కమ్మ సామాజిక వర్గాన్ని అణచివేస్తోన్నారని కాట్రగడ్డ ప్రసూన ఆరోపించారు. తాము మంత్రి పదవులకు పనికి రాబోమనే విషయాన్ని వైసీపీ చెప్పకనే చెప్పిందని మండిపడ్డారు. ఇలాంటి దుస్థితిని కమ్మ నాయకులు ఎప్పుడూ ఎదుర్కొనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర సామాజిక వర్గానికి చెందిన నేతలతో వైసీపీ.. కమ్మ నాయకులను తిట్టిస్తోందని, కాస్తయినా పౌరుషం తెచ్చుకోవాలని ఆమె అన్నారు. కమ్మ కులం ఓటుబ్యాంకు ఏకం కావాలని సూచించారు.
తక్షణమే వైసీపీ నుంచి బయటికి వచ్చి.. కమ్మ జాతి పౌరుషాన్ని, పరాక్రమాన్ని తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. జనాభాలో నాలుగు శాతం వరకు మాత్రమే ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి అయిదు మంత్రి పదువులను వైసీపీ ఇచ్చిందని కాట్రగడ్డ ప్రసూన విమర్శించారు. కమ్మ, బ్రాహ్మణ, వైశ్యులకు ఏపీ మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లభించలేదని ధ్వజమెత్తారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదని అన్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మంత్రివర్గం అనేది ఎప్పుడూ ఏర్పాటు కాలేదని చెప్పారు.
ఇప్పటికైనా వైసీపీలోని కమ్మ సామాజిక వర్గ నాయకులు కళ్లు తెరచుకోవాలని, పార్టీ నుంచి బయటికి రావాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీని, ప్రభుత్వాన్ని సర్వనాశనం చేయాలని కాట్రగడ్డ ప్రసూన అన్నారు. ఈ దిశగా కమ్మ నాయకులు ఓ శపథం తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో ఇదొక సంప్రదాయంగా మారే ప్రమాదం లేకపోలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే- రాజకీయంగా కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా అణగదొక్కినట్టవుతుందని చెప్పారు. సొంత కులానికి అన్యాయం జరిగితే చూస్తూ కూర్చోవద్దని అన్నారు.