Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ వ్యతిరేక పోరాటంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆశలు సన్నగిల్లుతున్నాయా?

బీజేపీ వ్యతిరేక పోరాటంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆశలు సన్నగిల్లుతున్నయా?
-జగన్ ,చంద్రబాబు బీజేపీకి జైకొడతారా ??
-బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యత సాధ్యం అవుతుందా ?
– 13 పార్టీల ఐక్యత …చివరివరకు నిలుస్తుందా ?
-బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యతకు ఫలిస్తుందా ?

2024 ఏప్రిల్ ,మే నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యత కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి . ఇందులో కలిసి వచ్చే శక్తులు , వ్యక్తులు ఎవరు ? అనేది నేడు చర్చనీయాంశంగా ఉంది. ఒకపక్క తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ కి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ బీజేపీయేతర ముఖ్యమంత్రులను , ఇతర ముఖ్యనాయకులు కలుస్తున్నారు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాడు ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో ఎంత కీలకంగా వ్యవహరించారో అంత కీలంకంగా దేశ రాజకీయాల్లో వ్యవహరించాలని బహుశా కేసీఆర్ భావించవచ్చు . కానీ నాటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు చాల తేడా ఉందనే విషయాన్నీ కేసీఆర్ విస్మరించారు . నాడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయి . నేడు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం . కాంగ్రెస్ ఉన్నంత ఉదాసీనంగా బీజేపీ ఉండదనేది కేసీఆర్ లాంటి అనుభవం ఉన్న రాజకీయనేత ఎందుకు విస్మరించారో అర్థం కానీ ప్రశ్న .తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కేవలం 17 లోకసభ సీట్లు …అందులో టీఆర్ యస్ గెలిచింది కేవలం 9 సీట్లు . ఒకవేళ ఎక్కువస్థానాలు పోటీచేద్దామన్న అవకాశం లేదు . 9 సీట్లు ఉన్న కేసీఆర్ దేశంలో చక్రం తిప్పుదామనుకుంటే అత్యాశే అవుతుంది. పైగా కేసీఆర్ కాంగ్రెస్ ,బీజేపీ లేని కూటమి అంటున్నాడు. కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యం కాదని అనేక పార్టీల నేతలు,రాజకీయ పండితులు చెబుతున్నారు . అయినప్పటికీ కాంగ్రెస్ లేని కూటమి అనేదానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. నిజంగా బీజేపీ ని ఓడించాలని అనుకుంటే కాంగ్రెస్ లేకుండా సాధ్యం కాదని వివిధ రాష్ట్రాల్లో నేతలు కేసీఆర్ కు కుండబద్దలు కొట్టి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బీజేపీతో ఆయన చేస్తున్న పోరాటం లో చివరకంటూ నిలబడతారా? లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీలో సంవత్సర కాలంగా జరిగిన రైతు ఉద్యమానికి మొదట మద్దతు ఇచ్చి ప్రధాని హోమ్ మంత్రిని కలిసినతరవాత కేసీఆర్ వెనక్కు తగ్గటంపై విమర్శలు ఉన్నాయి. రైతు ఉద్యమానికి మద్దతు ఇస్తానని ఢిల్లీ వెళ్లి కనీసం రైతు ఉద్యమం జరుగుతున్న ప్రాంతాలకు కూడా వెళ్లకుండా వచ్చిన సందర్భాలను విమర్శకులు ఎత్తి చూపుతున్నారు . అంతే కాకుండా రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో , బీజేపీ కి భేషరత్ మద్దతు ఇవ్వడమే కాకుండా డిమోనటైజేషన్ ,జీఎస్టీ విషయంలో అందరికన్నా ముందుగానే అసెంబ్లీ లో తీర్మానాలు చేయించి బీజేపీ కి బాసటగా నిలిచిన అంశాలు గుర్తు చేస్తున్నారు .

ఇక ఏపీ లో మరోరకంగా ఉంది. అక్కడ ప్రతిపక్షం , పాలకపక్షం రెండు బీజేపీ పట్ల మెతక వైఖరిని అవలంబిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి . అందువల్ల ఎవరు ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతారో చెప్పలేని పరిస్థితి ఉంది. సీఎం జగన్ , ప్రతిపక్ష నేత చంద్రబాబు , బలహీనతలను పట్టుకున్న మోడీ సర్కార్ ఇద్దరినీ తనకు అనుకూలంగా  వాడుకుంటుందనే  అభిప్రాయాలు ఉన్నాయి. మరి జగన్ , చంద్రబాబు బీజేపీ కి జై కొడతారా ? లేదా అనేది ఆశక్తిగా మారింది.

రానున్న లోకసభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని ప్రతిపక్షాలు ఐక్యం అవుతున్నాయి కొద్దీ రోజుల క్రితం ఢిల్లీలో 13 పార్టీలు కల్సి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.కాంగ్రెస్ నాయకత్వంలో చేసిన ఈ ప్రకటనపై ఎన్సీపీ , టీఎంసీ , సిపిఎం , సిపిఐ , డీఎంకే , ఆర్జేడీ లాంటి ప్రధాన పార్టీలు ఉండటం విశేషం . మరికొన్ని పార్టీలు ఈ కూటమికి మద్దతు పలికే అవకాశం ఉంది. సమాజావాది , బీఎస్పీ , శివసేన , నేషనల్ కాన్ఫరెన్స్ లాంటి పార్టీలు కూడా ఉన్నాయి. దక్షిణాదిన బలంగా ఉన్న కేసీఆర్ ,జగన్ ,చంద్రబాబులు బీజేపీ పట్ల తీసుకొనే వైఖరిపై ఆధారపడి బీజేపీ వ్యతిరేక కూటమి బలం ఆధారపడి ఉంటుంది.

బీజేపీ వల్ల దేశంలో అశాంతి పెరిగిందని మతకలహాలు పెరుగుతున్నాయని అందువల్ల ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బీజేపీయేతర పక్షాల ఐక్యత అవసరమని ప్రధాన పార్టీలు అభిప్రాయపడ్డాయి. ప్రతిపక్షాల ఐక్యత సాధ్యం కాదనుకుంటున్న సమయంలో ఈ ప్రకటన రావడం బీజేపీని నివ్వరపరిచింది. ఇన్ని పార్టీలు కలవడం ఒక ఎత్తు అయితే అందులో ఒకరంటే మరొకరికి గిట్టని టీఎంసీ , సిపిఎం ,సిపిఐ పార్టీల కూడా సంయక్త ప్రకటనపై సంతకం చేయడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతుండవచ్చు . ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో తామే గెలిచామని సంబరపడుతున్న బీజేపీ తమకు గత ఎన్నికల కన్నా 100 అసెంబ్లీ సీట్లు తక్కువ వచ్చాయన్న విషయాన్నీ మరుగున పరుస్తుంది. ఒక్క యూపీలో తప్ప మిగతా 4 రాష్ట్రాలలో ప్రధాన పోటీ దారుగా కాంగ్రెస్ ఉండటం గమనార్హం . కొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను చీల్చడం ద్వారం అధికారంలోకి రావడంపై విమర్శలు ఉన్నాయి. రెండు సార్లు మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ఆర్థిక రంగాన్ని దెబ్బతీసిందని విమర్శలు ఉన్నాయి. విదేశాంగ విధానంలో కూడా తడబాటుతనం తో దేశానికి నష్టం జరుగుతుందన్న ఆరోపణలను అధికార బీజేపీ ఎదుర్కొంటున్నది .

కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో అతి జోక్యం , రాష్ట్రాల హక్కులను కాలరాసి పెత్తనం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు భగ్గుమంటున్నారు . రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం గవర్నర్లను అడ్డం పెట్టుకొని రాష్ట్రాల్లో రాజకీయాలు చేయడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. బెంగాల్ లో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర గవర్నర్ చేస్తున్న రాజకీయాలు విదితమే . అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లో సైతం కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా తమిళశై వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు ఉన్నాయి. తమిళనాడులో కాబినెట్ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ సంతకం పెట్టకుండా ఉండటంపై అధికార పక్షం భగ్గుమంటున్నది .

అంతే కాకుండా దేశంలో ప్రజల సమస్యలు విస్మరించి మతం ,కులం ,ప్రాతీయతత్వాలను రెచ్చగొట్టడం ద్వారా తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ చర్యలపై ప్రతిపక్షాలు ద్రుష్టి సారించాయి. అన్ని రాష్ట్రాల్లో కాస్తో కూస్తో పలుకుబడి , ప్రజలతో సంబంధాలు కలిగిన కాంగ్రెస్ నాయకత్వంలో ముందుకు పోవాలని ప్రతిపక్షాలు ఒకనిర్ణయానికి రావడం శుభపరిణామంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . చూద్దాం ముందు ముందు ఇంకా ఎన్ని మార్పు లు జరగనున్నాయో చూద్దాం మరి !

Related posts

ఒవైసీల మెప్పు పొందడానికి కేసీఆర్ యత్నిస్తున్నారు: మాజీ సీఎం రమణ్ సింగ్!

Drukpadam

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పాకిస్తాన్ కు ఘాటు హెచ్చరిక …

Drukpadam

నీటి ప్రాజక్టు ల విషయంలో తెలంగాణ అబద్ధాలు చెబుతోందన్న ఏపీ!

Drukpadam

Leave a Comment