గతంలో మేం తగ్గాం… ఈసారికి మీరు తగ్గండి: టీడీపీ నేతలకు పవన్ కల్యాణ్ సూచన
- పొత్తులపై స్పందించిన పవన్
- 2014లో టీడీపీ, బీజేపీతో కలిశామని వెల్లడి
- రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టీకరణ
- పొత్తుల అంశాన్ని జనసేన కార్యకర్తలు తేలిగ్గా తీసుకోవాలని సూచన
జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం కీలక ప్రసంగం చేశారు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, ఇప్పుడే చర్చనీయాంశంగా మారిన పొత్తులపై స్పందించారు. ఈసారి జనసేన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని వెల్లడించారు. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం…. బీజేపీతో పాటు టీడీపీని కూడా కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం… జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని స్థాపించడం తమ ముందున్న అవకాశాలు అని పవన్ కల్యాణ్ వివరించారు.
వచ్చే ఎన్నికల్లో విజయం అనేది పార్టీల మధ్య ఐక్యతపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. 2014లో రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ, టీడీపీతో కలిశామని, విజయం సాధించామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ చాలాసార్లు తగ్గిందని, ఇప్పుడు మిగతా పార్టీలు తగ్గితే బాగుంటుందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
“టీడీపీ నేతలకు తాను ఒకటే చెబుతున్నా… బైబిల్ సూక్తిని మీరు కూడా పాటించండి. తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడును అని బైబిల్ లో ఉంది. జనసేన పార్టీ ఎప్పుడూ తగ్గే ఉంటుంది. పొత్తుల విషయాన్ని జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా పరిగణించవద్దు. ఈసారి ప్రజలే విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు.