Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎట్టకేలకు వెనక్కి తగ్గిన శ్రావణ భార్గవి!

ఎట్టకేలకు వెనక్కి తగ్గిన శ్రావణ భార్గవి!
-వీడియో నుంచి అన్నమాచార్య కీర్తన తొలగింపు
-మ్యూజిక్ తో వీడియో కొనసాగింపు
-నెగెటివిటీని ఏమాత్రం ప్రోత్సహించనని వెల్లడి
-ప్రతి అంశానికి దృష్టికోణం ఉంటుందని వ్యాఖ్యలు
-శ్రావణ భార్గవి మెడలో తాళి లేదు, కాళ్లకు మెట్టెలు లేవు, నుదుటన బొట్టు లేదు: కరాటే కల్యాణి

అన్నమయ్య కీర్తనతో ఓ వీడియో రూపొందించి వివాదంలో చిక్కుకున్న టాలీవుడ్ గాయని శ్రావణ భార్గవి ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో, తన వీడియోలో బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న అన్నమయ్య కీర్తనను తొలగించింది. అయితే వీడియోను మాత్రం తొలగించలేదు. కేవలం సంగీతం వినిపిస్తుండగా, ఆ వీడియో కొనసాగించింది.

ఇటీవల టాలీవుడ్ గాయని శ్రావణ భార్గవి ఒకపరి కొకపరి అంటూ సాగే అన్నమయ్య గీతాన్ని ఆలపించిన వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో శ్రావణ భార్గవి కనిపించిన తీరు వివాదాస్పదమైంది. ఆ వీడియోను తొలగించాలని తిరుమల అన్నమయ్య ట్రస్ట్ సభ్యులు కూడా డిమాండ్ చేశారు. అయితే తన వీడియోలో అశ్లీలం ఎక్కడుందని శ్రావణ భార్గవి వాదిస్తోంది. తాజాగా ఈ వివాదంలోకి సినీ నటి కరాటే కల్యాణి కూడా ఎంటరైంది.

దీనిపై గాయని శ్రావణ భార్గవి స్వయంగా వివరణ ఇచ్చింది. తానెప్పుడూ కావాలని వివాదాలను రేకెత్తించలేదని స్పష్టం చేసింది. అన్నమయ్య పట్ల విశేష గౌరవంతో ఆ వీడియో రూపొందించానని, అందుకు ఎంతో శ్రమ, సమయం ఖర్చు చేశానని వెల్లడించింది. ప్రతికూల ధోరణులకు తానెప్పుడూ దూరంగా ఉంటానని, ఏమాత్రం ప్రోత్సహించనని స్పష్టం చేసింది.

ఏదేమైనా తన వీడియో ఓ కళాఖండం అని విశ్వసిస్తున్నానని, ప్రతి అంశానికి ఓ దృష్టికోణం ఉంటుందని అభిప్రాయపడింది. అది చూసే తీరును బట్టి ఉంటుందని, తీరు మారినప్పుడే మార్పు కనబడుతుందని శ్రావణ భార్గవి పేర్కొంది.

కరాటే కళ్యాణి ఎంటర్ ..ముందు హిందూ ధర్మాన్ని పాటించమని హితవు

“నుదుటన బొట్టు లేదు, కాళ్లకు మెట్టెలు లేవు, మెడలో తాళి లేదు… పెళ్లయిన మహిళలకు ఇవన్నీ ఉండాలని శ్రావణ భార్గవికి తెలియదా?” అని కరాటే కల్యాణి ప్రశ్నించింది. “వాటిలో ఏ ఒక్కటీ ధరించకుండా, కాళ్లు చేతులూ ఊపుతూ అన్నమాచార్య కీర్తన పాడాను అంటే కుదురుతుందా? నీ పాటలో అశ్లీలం లేదంటున్నావు. ముందు, హిందూ ధర్మం ప్రకారం వివాహిత చిహ్నాలు ధరించు. ఆ పాటను డిలీట్ చెయ్” అంటూ కరాటే కల్యాణి డిమాండ్ చేసింది.

టాలీవుడ్ లో ఎంతో ప్రతిభావంతులైన సింగర్లుగా గుర్తింపు ఉన్న శ్రావణ భార్గవి, హేమచంద్ర పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే వారు విడాకులు తీసుకోనున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా శ్రావణ భార్గవి తన వీడియోలో మెడలో తాళి, కాళ్లకు మెట్టెలు, బొట్టు లేకుండా కనిపించడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోందని అంటున్నారు.

Related posts

ఏపీ అప్పులపై రఘురామకృష్ణరాజు ప్రశ్న.. వివరాలు వెల్లడించిన నిర్మలా సీతారామన్

Ram Narayana

పల్లెల ప్రగతి ,పట్టాన ప్రగతిపై కేసీఆర్ సమీక్ష;తాను ఒక జిల్లా దత్తత

Drukpadam

చంద్రబాబును అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమన్న సీబీఐ మాజీ డైరెక్టర్.. ఆయన ఏం చెప్పారంటే..!

Ram Narayana

Leave a Comment