మరో భారీ సంక్షేమ పథకాన్ని ప్రకటించిన జగన్ సర్కారు…
- అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కల్యాణమస్తు పథకం
- వివాహం చేసుకునే జంటకు పెళ్లి కానుక పేరిట ఆర్థిక సాయం
- ఎస్సీ, ఎస్టీలకు రూ.1 లక్ష మేర సాయం చేయనున్న ప్రభుత్వం
- కులాంతర పెళ్లిళ్లు చేసుకునే ఎస్సీ, ఎస్టీలకు రూ.1.20 లక్షలు
- బీసీలకు రూ.50 వేలు, కులాంతర వివాహాలు చేసుకునే బీసీలకు రూ.75 వేలు
- విభిన్న ప్రతిభావంతుల పెళ్లిళ్లకు రూ.1.50 లక్షల సాయం
- వైఎస్సార్ షాదీ తోఫా పేరిట ముస్లింల వివాహాలకు రూ.1 లక్ష కానుక
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం శనివారం మరో భారీ సంక్షేమ పథకాన్ని ప్రకటించింది. వైఎస్సార్ కల్యాణమస్తు పేరిట ఈ కొత్త పథకాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు విభిన్న ప్రతిభావంతుల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది.
వైఎస్సార్ కల్యాణమస్తు పథకం కింద వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. అదే విధంగా కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.1.30 లక్షలను అందించనుంది. పెళ్లి చేసుకునే ఎస్టీలకు రూ.1 లక్ష అందించనున్న ప్రభుత్వం… కులాంతర వివాహాలు చేసుకునే ఎస్టీలకు రూ.1.20 లక్షలు అందించనుంది. వివాహం చేసుకునే విభిన్న ప్రతిభావంతులకు ఈ మొత్తాన్ని రూ.1.50 లక్షలుగా అందించనుంది.
ఇక వివాహం చేసుకునే బీసీలకు రూ.50 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం.. కులాంతర వివాహాలు చేసుకునే బీసీలకు రూ.75 వేలు అందించనుంది. ఇక పెళ్లిళ్లు చేసుకునే ముస్లింలకు రూ.1 లక్ష చొప్పున పెళ్లి కానుక ఇవ్వాలని… వీరికి ఇచ్చే ఈ సాయానికి వైఎస్సార్ షాదీ తోఫా అని పేరు పెట్టింది. ఈ పథకం అమలు, విధి విధానాలకు సంబంధించి శనివారం రాత్రి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.