తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం… 12 మంది రాజీనామా!
-తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర విభేదాలు
-రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్లు!
-ఇటీవల పీసీసీ కమిటీల ప్రకటన
-టీడీపీ నుంచి వచ్చినవారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పటినుంచో ఉన్న అసంతృప్తులు ఇటీవల పీసీసీ కమిటీల ప్రకటన అనంతరం భగ్గుమన్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంపై ఇప్పటికే నిరసన గళం వినిపిస్తున్న పార్టీ సీనియర్లు ఇటీవల పరిణామాలతో ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారికే తెలంగాణ కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నేడు అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగ్గా… 12 మంది నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ 12 మంది నేతలు గతంలో టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరినవారే!
రాజీనామా చేసిన వారిలో ధనసరి సీతక్క, విజయరామారావు, నరేందర్ రెడ్డి, ఎర్ర శేఖర్, చారగొండ వెంకటేశ్ తదితరులు ఉన్నారు. వీరు తమ రాజీనామా లేఖలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణికం ఠాగూర్ కు పంపినట్టు తెలుస్తోంది.
రేవంత్ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శులు కూడా హాజరయ్యారు.
అన్ని వర్గాలు కలిస్తేనే కాంగ్రెస్ అన్న మధు యాష్కీ
పీసీసీ కమిటీల ప్రకటన అనంతరం తెలంగాణ కాంగ్రెస్ లో లుకలుకలు మరింత ముదిరిన నేపథ్యంలో సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాలు కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ అని మధు యాష్కీ స్పష్టం చేశారు. కొత్తవాళ్లకు పదవులు ఇస్తే అసంతృప్తులు ఉంటాయని తెలియదా? నా చిన్న తమ్ముడు రేవంత్ రెడ్డి ఈ విషయం గ్రహిస్తే మంచిది అని హితవు పలికారు.
“నీ వర్గం మద్దతుతో పదవిలోకి వచ్చావు. పదవిని చేపట్టాక ఏంచేయాలి? న్యాయవాదిగా ఉన్న వ్యక్తి జడ్జి స్థానంలో కూర్చుంటే న్యాయవాదిలా ఆలోచించడు… న్యాయం గురించి ఆలోచించాలి. పార్టీ నాయకుడు కూడా ఇలాగే వ్యవహరించాలి. పరిస్థితిని అందరికీ వివరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే పార్టీ బలం పుంజుకుని అధికారంలోకి వస్తుంది. కానీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురైతే విజయం ఎలా సాధ్యమవుతుంది? ఆయనొక వర్గాన్ని తీసుకువస్తే, నేనొక వర్గాన్ని తీసుకువస్తే అది వర్గ పోరు అవుతుంది. ఇక్కడ మేం కోరుకుంటోంది అందరం కలిసి పనిచేసి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే” అని మధు యాష్కీ వివరించారు.