Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తారకరత్నను పరామర్శించిన విజయసాయిరెడ్డి… బాలకృష్ణకు కృతజ్ఞతలు!

తారకరత్నను పరామర్శించిన విజయసాయిరెడ్డి… బాలకృష్ణకు కృతజ్ఞతలు!

  • టీవల గుండెపోటుకు గురైన తారకరత్న
  • బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స
  • నేడు బెంగళూరు వచ్చిన విజయసాయిరెడ్డి
  • తారకరత్న భార్య విజయసాయికి కూతురు వరస   

బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్నకు విజయసాయిరెడ్డి బంధువు అన్న సంగతి తెలిసిందే. తారకరత్న భార్య అలేఖ్య ఎవరో కాదు… విజయసాయిరెడ్డి అర్ధాంగి సునంద చెల్లెలి కూతురే. అలేఖ్య రెడ్డిని తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ వరుసలో విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు అవుతారు.

ఈ నేపథ్యంలో, నారాయణ హృదయాలయ ఆసుపత్రికి విచ్చేసిన విజయసాయిరెడ్డి… తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం తారకరత్న గుండె, కాలేయం ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సాఫీగా పనిచేస్తున్నాయని తెలిపారు. గుండెకు ఇవాళ ఎలాంటి చికిత్స అందించలేదని, అయితే తారకరత్న మెదడులో వాపు ఏర్పడిందని వివరించారు.

తారకరత్న గుండెపోటుకు గురైన రోజున 45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయిందని, దాంతో మెదడులో కొంతభాగం దెబ్బతిన్నదని తెలిపారు. మెదడులో నీరు చేరిన ఈ పరిస్థితిని ఎడిమా అంటారని వివరించారు. దీంతో మెదడు కిందికి జారిపోయే ప్రమాదం ఉందని అన్నారు.

మరో మూడ్నాలుగు రోజుల్లో మెదడు ఆరోగ్యానికి సంబంధించిన పురోగతి కనిపించవచ్చని డాక్టర్లు ఇటీవల చెప్పారని వివరించారు. ఇప్పటికే మూడ్రోజులు గడచిపోయింది కాబట్టి, రేపటి నుంచి ఆయన మెదడు ఆరోగ్యం నిలకడగా ఉంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

డాక్టర్లు అద్భుతమైన చికిత్స అందిస్తున్నారని విజయసాయి కొనియాడారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. తారకరత్నకు సంబంధించి అన్ని విషయాలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారని వివరించారు.

Related posts

కాంగ్రెస్ నన్ను 91 సార్లు తిట్టింది.. ‘విష సర్పం’ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కౌంటర్

Drukpadam

తెల్లం వెంకట్రావు ఎక్కడకు వెళ్ళరు… అభద్రతా భావంలో బీఆర్ యస్ …మంత్రి పొంగులేటి

Ram Narayana

రాహుల్ గాంధీకి మధ్యంతర బెయిల్ మంజూరు..!

Drukpadam

Leave a Comment