Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీలో బీజేపీకి షాక్ ….కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి గుడ్ బై …

ఏపీలో బీజేపీకి షాక్ ….పార్టీకి గుడ్ బై చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ…
-రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఏపీ నేత
-రాష్ట్ర నాయకత్వం తీరు సరిగాలేదంటూ ఆరోపణ
-ముఖ్య అనుచరులతో ఉదయం భేటీ అయిన కన్నా.. ఆపై మీడియా సమావేశం
-పార్టీ అధిష్ఠానమే స్పందిస్తుందన్న జీవీఎల్

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సరిగాలేదని ఆరోపిస్తూ ఆ పార్టీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా గురువారం ఉదయం తన ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. పార్టీ మార్పుపై వారితో చర్చించాక మీడియా సమావేశం ఏర్పాటు చేసి, బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు అనుచరులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే ప్రకటన చేస్తానని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.

2014లో నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ఆకర్షింపబడి బీజేపీలో చేరినట్లు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడానికి సామాన్య కార్యకర్తలాగా పనిచేశానని ఆయన చెప్పారు. తన పనితీరు చూసి అధిష్ఠానం 2018లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిందని తెలిపారు. తాను బాధ్యతలు తీసుకున్న ఏడాదికే.. అంటే 2019లో జరిగిన ఎన్నికలు వచ్చాయని చెప్పారు. అయినప్పటికీ సాధ్యమైనంత మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రచారం చేశానని కన్నా వివరించారు.

కోవిడ్ తర్వాత తనను తప్పించి సోము వీర్రాజుకు పార్టీ అధ్యక్ష పదవి అప్పగించారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అప్పటి నుంచి రాష్ట్రంలో పగలు, కక్ష సాధింపు చర్యలపైనే పార్టీ నేతలు దృష్టి సారించారని ఆరోపించారు. స్థానిక నాయకులకు డబ్బు సంపాదనే లక్ష్యంగా మారిందని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను పట్టించుకోవట్లేదని విమర్శించారు. రాష్ట్ర నాయకత్వం తీరు సరిగ్గాలేదని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో స్థానిక నేతల మధ్య ఇమడలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీపై ఉన్న అభిమానం మాత్రం చెరిగిపోయేది కాదని ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపై స్పందించేందుకు బీజీపీ రాష్ట్ర నేతలు ఎవరూ ముందుకు రాలేదు. బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్ కూడా మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ విషయంలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని తేల్చిచెప్పారు. మీరు చెబితేనే నాకా విషయం తెలిసిందంటూ మీడియా ప్రతినిధులతో కామెంట్ చేశారు. పూర్తి వివరాలు తెలిశాక పార్టీ అధిష్ఠానం నుంచి స్పందన ఉంటుందని జీవీఎల్ పేర్కొన్నారు.

ఇటీవల టీడీపీకి కన్నా లక్ష్మీనారాయణ దగ్గరవుతున్నదని ప్రచారం జరుగుతున్నవేళ ఆయన రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొన్నది .చంద్రబాబుతో కూడా కొద్దిరోజుల క్రితం ఆయన సమావేశం అయ్యారు .

Related posts

మసక బారుతున్న మోడీ-షాల ప్రభ ….

Drukpadam

పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతల ఎదురు దాడి…

Drukpadam

మోదీ మంత్రివర్గంలో తిరిగి చోటు దక్కని ప్రముఖులు వీరే…

Ram Narayana

Leave a Comment