పుతిన్ ను సొంత మనుషులే చంపేస్తారు: జెలెన్ స్కీ!
- ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రకు ఏడాది పూర్తి
- ఓ డాక్యుమెంటరీలో జెలెన్ స్కీ వ్యాఖ్యలు
- అంతరంగికుల చేతిలోనే పుతిన్ చావు రాసిపెట్టి ఉందని వెల్లడి
- అత్యంత నమ్మకస్తులే అతడిపై తిరుగుబాటు చేస్తారని వివరణ
రష్యా దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్ ఏదో ఒకనాడు సొంత మనుషుల చేతిలోనే చనిపోతాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ అంతరంగికులే అతడికి చరమగీతం పాడతారని పేర్కొన్నారు.
‘ఇయర్’ అనే డాక్యుమెంటరీలో జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రకు ఏడాది పూర్తయిన రోజునే ఈ డాక్యుమెంటరీ రిలీజైంది. పుతిన్ నాయకత్వం అత్యంత బలహీనంగా మారే రోజులు వస్తాయని, అత్యంత నమ్మకస్తులు అనుకున్నవారే అతడిపై తిరుగుబాటు చేస్తారని జెలెన్ స్కీ పేర్కొన్నారు.
“రష్యా అధినాయకత్వం పతనం కావడం తథ్యం. ఆ వేటగాడు ఇతర వేటగాళ్ల చేతిలో బలి కావడం తథ్యం. ఆ హంతకుడ్ని చంపడానికి వాళ్లకు అప్పటికి ఓ కారణం దొరుకుతుంది. నేను చెప్పిన మాటలను వారు గుర్తుచేసుకుంటారు” అని జెలెన్ స్కీ వివరించారు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందన్నది తాను చెప్పలేనని వ్యాఖ్యానించారు.