అవినాశ్ రెడ్డిని 25 వరకు అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో సునీత పిటిషన్…
- వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ
- ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అవినాశ్
- తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన సునీత
వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను ప్రతి రోజూ విచారిస్తోంది. ఈ క్రమంలో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు… ఈ నెల 25 వరకు అవినాశ్ ను అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. 25న తమ తీర్పును వెలువరిస్తామని చెప్పింది.
ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేశారు. 25న హైకోర్టు తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో… వెంటనే ఈ పిటిషన్ పై విచారణ జరపాలని సునీత తరపు లాయర్ సుప్రీంకోర్టును కోరారు. దీనికి సమాధానంగా రేపు విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం తెలిపింది.