సీబీఐ అదుపులో ఉన్న బెంగాల్ మంత్రులకు బెయిల్!
నారదా కుంభకోణం కేసులో అరెస్టయిన మంత్రులు
మరో ఇద్ధరినీ అదుపులోకి తీసుకున్న సీబీఐ
అరెస్టును వ్యతిరేకిస్తూ మమత నిరసన
రోజులో ఎక్కువ భాగం సీబీఐ ఆఫీసులోనే ఉన్న దీదీ
ఎట్టకేలకు సాయంత్రం బెయిల్ మంజూరు
నారదా కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఇద్దరు బెంగాల్ మంత్రులతో పాటు మరో ఇద్దరు నాయకులకు ఎట్టకేలకు బెయిల్ మంజూరయింది. అంతకుముందు సీబీఐ కార్యాలయం ఎదుట నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వారి అరెస్టును నిరసిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోజులో ఎక్కువ భాగం సీబీఐ ఆఫీసు వద్దే ఉన్నారు. కావాలంటే తననూ అరెస్టు చేయాలని సీబీఐ అధికారులకు సవాల్ విసిరారు.
ఈరోజు ఉదయం నారదా కుంభకోణం కేసులో ఇటీవలే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీతో పాటు తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ తృణమూల్ నేత సోవణ్ ఛటర్జీని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకన్నారు. వీరి అరెస్టును వ్యతిరేకిస్తూ దీదీ సహా తృణమూల్ వర్గాలు సీబీఐ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.