కేంద్రాన్ని మళ్లీ టార్గెట్ చేసిన మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్!
- పుల్వామా దాడి ప్రస్తావన తెచ్చిన జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్
- 2019 నాటి ఎన్నికలు భారత సైనికుల శవాలపై పోరాటమని వ్యాఖ్య
- ఘటనపై దర్యాప్తు జరిగి ఉంటే అప్పటి హోం మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చేదని కామెంట్
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. పుల్వామా ఉగ్రదాడిని గుర్తు చేసిన ఆయన, 2019 నాటి ఎన్నికలు మన సైనికుల శవాలపై పోరాటమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల పోరు సైనికుల శవాలపై జరిగిందన్న ఆయన ఈ ఘటనపై ఎలాంటి దర్యాప్తు జరగలేదని చెప్పారు. విచారణ జరిగి ఉంటే అప్పటి హోం మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చేదని చెప్పుకొచ్చారు. అనేక మంది అధికారులు జైలు పాలయ్యే వారని, విషయం వివాదాస్పదం అయ్యేదని తెలిపారు.
‘‘ఉగ్రదాడి జరిగిన రోజున ప్రధాన మంత్రి మోదీ జిమ్‌కార్బెట్ నేషనల్ పార్కులో షూటింగ్‌లో ఉన్నారు. ఆయన పార్కు నుంచి బయటకు రాగానే నేను ఫోన్ చేశాను. మన పొరపాటు వల్ల సైనికులు మరణించారని చెప్పాను. దీంతో, ఆయన నాకు మౌనంగా ఉండమని చెప్పారు’’ అని సత్యపాల్ మాలిక్ వెల్లడించారు.