- ఐటీ రిటర్నులకు జులై 31 తుది గడువు
- నేడు ఒక్క గంట వ్యవధిలో 3.04 లక్షల ఐటీఆర్ లు దాఖలు
- ఇప్పటివరకు రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 5.83 కోట్లు
- చివరి రోజున భారీ సంఖ్యలో రిటర్నులు దాఖలయ్యే అవకాశం
భారత్ లో ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2022లో మొత్తం 7.4 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేయగా…. ఈ ఏడాది ఇప్పటివరకు 5.83 కోట్ల మంది ఐటీఆర్ లు దాఖలు చేశారు. ఐటీ రిటర్నుల దాఖలుకు రేపు (జులై 31) తుది గడువు కావడంతో భారీ సంఖ్యలో రిటర్నులు దాఖలయ్యే అవకాశాలున్నాయి.
ఇవాళ ఒక్కరోజే భారీ సంఖ్యలో ఐటీఆర్ లు దాఖలయ్యాయి. చివరి ఒక్క గంట వ్యవధిలోనే 3.04 లక్షల రిటర్నులు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే ఐటీ విభాగం పోర్టల్ లోకి 1.78 కోట్ల మంది లాగిన్ కాగా, ఇవాళ కూడా అదే ఒరవడి నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 10.39 లక్షల ఐటీఆర్ లు దాఖలయ్యాయి.
ఇంకా 2 కోట్ల మందికి పైగా ఐటీఆర్ లు దాఖలు చేయాల్సి ఉండగా, రేపు చివరి రోజున ఐటీ విభాగం పోర్టల్ కు పోటెత్తే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు. కాగా, జులై 31 తర్వాత రిటర్నుల దాఖలుకు జరిమానాతో అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు.